ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరాకు వెనుకంజ 

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేసేందుకు ఫార్మా కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, తక్కువ ధరకు మందులు ఇవ్వాలని కోరడంతో చాలా కంపెనీలు కనీసం టెండర్లు కూడా వేయడం లేదు. 

ఈసారి ఆసుపత్రులకు పంపిణీ చేసేందుకు సుమారు 600 రకాల మందులు కొనుగోలు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏయే మందు ఏయే ధరలో కొనాలన్నది కూడా అధికారులే నిర్ణయిస్తారు. ఆ ధరలో సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ‘రేట్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌’ ఇస్తారు. అవసరమైన ప్రతిసారీ రేట్ కాంట్రాక్ట్ సంస్థలుమందులను సరఫరా చేయాల్సి ఉంటుంది. 

ప్రభుత్వం కూడా ఈ సంస్థల వద్దే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈసారి ఇతర రాష్ట్రాలలో కంటే తక్కువ ధరకు మందులు కొనాలని నిర్ణయించడంతో, రేట్ కాంట్రాక్ట్ తీసుకునేందుకు ఫార్మా సంస్థలు ఆసక్తి చూపడం లేదు. 600 రకాల మందులలో సుమారు 200 రకాల మందులు రేట్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి సంస్థలు ముందుకు రాలేదని తెలిసింది. 

ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరత విపరీతంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌తో చైనా నుంచి ముడి సరుకు దిగుమతి ఆగిపోయింది. దీంతో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడి, మందుల కొరత ఏర్పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మందుల కొనుగోలు ఆలస్యమైతే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదముందంటున్నారు. 

రెండేండ్లుగా మందుల కొనుగోలుకు ప్రభుత్వం అరకొరగానే నిధులు కేటాయిస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.332 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది కేవలం రూ.226 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయించిన దాంట్లో 70 శాతం నిధులను కూడా విడుదల చేయలేదు. దీంతో మందుల కొనుగోలుదారులకు టీఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఐడీసీ భారీగా బకాయిలు పడింది. 

టీచింగ్ హాస్పిటళ్ల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ అవసరమైన మందులను ఈ సంస్థ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడంతో, మందులు సరఫరా చేసిన, ఆరేడు నెలలకు కూడా ఫార్మా సంస్థలకు డబ్బులు విడుదల చేయడం లేదు. 

ఇతర రాష్ట్రాల కంటే కాస్త ధరలు ఎక్కువగా చెల్లిస్తుండడంతో, ఇప్పటివరకూ మెడిసిన్ సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ధరలు ఎక్కువగా ఉండడంపై ఇటీవల మంత్రి ఈటల సమీక్షించారు. ఇతర రాస్త్రాలలో కంటే తక్కువకే మందులను కొనుగోలు చేయాలని సూచించారు.