జాస్తి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్ రద్దు 

ఐఆర్‌ఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ) మాజీ సీఈవో, ఆదాయ పన్ను శాఖ (ఐటీ) కమిషనర్‌ జాస్తి కృష్ణకిశోర్‌ విషయంలో జగన్‌ ప్రభుత్వానికి గట్టి షాక్‌ తగిలింది. ఆయన సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) రద్దు చేసింది. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. అవి చట్టవిరుద్ధమంటూ కొట్టివేసింది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ఉన్న కృష్ణకిశోర్‌ను వెంటనే ఆదాయ పన్ను శాఖలో చేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు క్యాట్‌ చైర్మన్‌ జస్టిస్‌ లింగాల నరసింహారెడ్డి, సభ్యులు (పరిపాలన) బీవీ సుధాకర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం  తీర్పునిచ్చింది. అయితే కృష్ణకిశోర్‌పై ఉన్న కేసుల్లో చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. 

ఈడీబీ సీఈవోగా కృష్ణకిశోర్‌ను తొలగించాక.. మళ్లీ సస్పెండ్‌ చేసి వేధింపులకు గురిచేయడం ఎందుకని ట్రైబ్యునల్‌ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని గతంలో విచారణ సందర్భంగా ప్రశ్నించింది కూడా. ‘పదోన్నతి వచ్చిందని, మాతృ సంస్థకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను అంగీకరిస్తే వచ్చే నష్టమేంటి?  ఆయన్ను ఇక్కడే ఉంచాల్సిన అవసరం ఏముం ది? ' అను ప్రశ్నించింది. 

ఏపీఈడీబీ సీఈవోగా ఆయన్ను ఇప్పటికే తొలగించారు. ఏదో తప్పు జరిగిందనుకుంటే ఆ శిక్ష చాలు. అలాకాకుండా సస్పెండ్‌ చేశారు. మాతృసంస్థకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇంతలా ఎందుకు వేధింపులకు గురిచేస్తున్నారు? అధికారం ఉంది కాబట్టి చెలాయిస్తామంటే చట్టం అనుమతించదని స్పష్టం చేసింది. 

సీఈవోగా డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు వచ్చిన కేంద్ర సర్వీసులకు చెందిన అధికారిని ఎక్స్‌అఫీషియో కార్యదర్శి/డిప్యూటీ సెక్రటరీగా రాష్ట్ర సర్వీసుల్లోకి ఎలా బదిలీ చేస్తారు? ఈ తరహా చట్టవిరుద్ధమైన చర్య తీసుకోవడానికి ఎంత ధైర్యం? సీఈవోగా ఉంటే చర్యలు తీసుకోలేరు కాబట్టి... కక్షసాధించడానికే జీఏడీకి మార్చినట్లున్నారు. 

అయినా పీవీ రమేశ్‌ (సీఎం కార్యాలయంలో అదనపు సీఎస్‌) ఎవరు? ఆయనకున్న అధికారాలేంటి? మండలి సీఈవోపై చర్య తీసుకునేందుకు ఆయనెవరు? ఇదేం పరిపాలన! కృష్ణకిశోర్‌ తప్పుచేశాడని చెబుతున్నారు? ఏంతప్పు చేశారు? సస్పెండ్‌ చేసి ఏసీబీ/సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాల్సినంత పెద్ద తప్పా అది? ఆయనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి.. ఆయన మాతృసంస్థ ఆదాయ పన్ను శాఖకు సమాచారమిచ్చారా’ అని చైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు.

కాగా, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో.. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించి.. ఆ సంస్థ ఆస్తులను మదింపు చేసిన అధికారికి కృష్ణకిశోర్‌ పర్యవేక్షణ అధికారిగా పనిచేయడం గమనార్హం.