కరొనతో అప్పుల ఊబిలో చైనా కంపెనీలు 

ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్తే ప్రభావంతో చైనా కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.  దీనితో  చైనా కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. కార్మికులకు వేతనాలిచ్చేందుకు, ముడి సరుకును సరఫరా చేసేవారికి చెల్లింపులు చేసేందుకు పలు సంస్థలు తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నాయి.

కరోనా కారణంగా వ్యాపారాలు పడిపోవడమే ఇందుకు కారణం. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో దేశం అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటోందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్  స్వయంగా వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని మళ్ళీ గట్టెక్కించేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. 

ఈ క్రమంలోనే... అప్పులు ఇవ్వడంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలంటూ బ్యాంకులకు చైనా సర్కారు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే... కరోనా ప్రభావంతో... దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయాయి.

దేశం మొత్తం మీద దాదాపు 60 శాతం సంస్థలు ప్రస్తుతం తమ దగ్గరున్న నగదు నిల్వలతో కేవలం మరో రెండు నెలల పాటు మాత్రమే మనుగడ సాగించగలవని 'ది చైనీస్ అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్' తెలిపింది. 

మరో పది శాతం సంస్థలు మాత్ం మరొ ఆరు నెలల వరకు మనుగడ సాగించగలవని పేర్కొంది. అయితే ఈ ఆర్ధిక సంవత్సరం... రెండో త్రైమాసికానికి చైనా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ అంచనా వేస్తోంది.

 కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి కారణంగా చైనాలో మార్చి ఐదోతేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వార్షిక పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. దశాబ్దాలకాలంలో ఇలా సమావేశాలు వాయిదాపడటం ఇదే తొలిసారి.

మరోవంక, దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టించింది. చైనాలో మరణమృదంగం మోగిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి.. ఇతర దేశాలకూ విస్తరిస్తుండటం మదుపరులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. కుప్పకూలిన ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రభావంతో భారతీయ సూచీలూ భీకర నష్టాలకు లోనైయ్యాయి.