కేరళలో రాజనాథ్ సింగ్ ఏరియల్ సర్వే

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన ప్రాంతాలను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి  పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నాడని చెబుతూ తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, సీఎం విజయన్‌తో మాట్లాడానని ఆయన చెప్పారు.

సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తు నియంత్రణ సహాయ బలగాలను కేరళకు పంపించామన్నారు. ప్రతి టీంలో 45 మంది సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

కాగా మృతుల సంఖ్య 37 వద్ద ఆగిపోగా, రెండు రోజుల నుండి సంఖ్య పెరగక పోవడం కొంత ఉపసమనం కలిగిస్తున్నది. వర్షం తగ్గుముఖం పట్టినా ఆదివారం మల్లి జల్లులు ప్రారంభమయ్యాయి. మరో నాలుగు రోజుల పాటు పరిస్థితులు ఇవే విధంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సహాయ శిబిరాలలో వివిధ చోట్ల సుమారు 60 వేల మంది ప్రజలు ఉన్నారు.