దేశ సార్వభౌమాధికారంపై మడం తిప్పం : మోడీ

భారతదేశ శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారికి మన సైనికులు గట్టి సమాధానం చెబుతారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. పాకిస్థాన్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించనప్పటికీ, శాంతిని బలంగా నమ్మే దేశం ఇండియా అని, దేశ సార్వభౌమాధికారం, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రధాని పేర్కొన్నారు.  'మన్ కీ బాత్' రేడియో షో 48వ ఎడిషన్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఆదివారంనాడు మాట్లాడారు.

'శాంతికి మనం కట్టుబడి ఉన్నాం. అదే విధానంతో ముందుకు వెళ్తాం. అయితే దేశ సార్వభౌమాధికారం, స్వాభిమానం విషయంలో రాజీ ఉండదు' అని తెలిపారు. భారత ఆర్మీ ప్రత్యేక బలగాలు జరిపిన సర్జికల్ దాడులను ప్రధాని గుర్తుచేస్తూ, మన సైనికులు 2016లో ఉగ్రవాదానికి గట్టి గుణపాఠం చెప్పారని, భవిష్యత్తులో కూడా ఇదే విధానం అనుసరిస్తామని స్పష్టం చేశారు. సాయిధ బలగాల సాహసం, అంకితభావం తిరుగులేనిదని కొనియాడారు.  కుల, మత, భాషా భేదాలకు అతీతంగా దేశ ప్రజలంతా సైనికులకు సంఘీభావంగా నిలుస్తారని భరోసా వ్యక్తం చేసారు.

ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉందని తెలుపుతూ ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళాల్లో అత్యధిక సేవలందించిన దేశాల్లో ఇండియా ఒకటని మోదీ పేర్కొన్నారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో భారత సైనికుల సేవలే శాంతి పట్ల మన దేశానికి ఉన్న నిబద్ధతను చాటుతాయని ఆయన గుర్తు చేసారు.

భారత వైమానికి దళ సేవలు నిరుపమానమని, ఎయిర్ వారియర్స్‌‌కు దేశం రుణపడి ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భాగ్మా ప్రశంసలు కురిపించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా భారత వైమానిక దళం నిరుపమాన సేవలందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

'సహాయ, పునరావాస కార్యక్రమాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కావచ్చు, వాయి సైనికులు దేశానికి అందిస్తున్న నిరుపమాన సేవలు చిరస్మరణీయం. వరదలు, తుఫానులు, అడవుల్లో దావానలం చెలరేగిన సందర్భాల్లో ఎంతో సాహసంతో దేశ ప్రజలకు అసమాన సేవలందిస్తున్నారు' అని ప్రధాని కొనియాడారు.

ఎయిర్, డిఫెన్స్ ఫోర్సులలో మహిళలకు ప్రవేశం కల్పించడం ద్వారా లింగవివక్షకు తావులేదని ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ చాటిందని ప్రశంసించారు. పురుషులతో పాటు మహిళా శక్తికి సమప్రాధాన్యం ఇవ్వడం ఇండియాకు గర్వకారణమని మోదీ తెలిపారు.  కాగా, అక్టోబర్ 8న భారత వైమానికి దళం 86వ వార్షికోత్సవం జరుపుకోనుంది.