రేవంత్ పై ఇటి దాడులతో బోల్తా పడిన కెసిఆర్ వ్యూహం

ప్రతిపక్ష నేతలలో కొరకరాని కొయ్యగా మిగిలిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఇటి అధికారులు సోదాలు జరపడంతో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సంబరపడి పోయారు. సుమారు వేయి కోట్ల రూపాయల మేరకు అక్రమ ఆస్తుల గుట్టు రట్టయిన్నట్లు ప్రచారం చేసారు. ఇక అరెస్ట్ అయిన్నట్లే అని, ఎన్నికలు ముగిసే వరకు బయటకు వచ్చే అవకాశం లేదని ముచ్చట పడ్డారు.

అయితే అటువంటిది ఏదీ జరగక పోవడం, 44 గంటల పాటు సోదాలు జరిపినా, ఆయనతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్ళలపై కూడా సోదాలు జరిపినా, 36 గంటల పాటు రేవంత్ ను ప్రశ్నలతో ముంచెత్తినా పెద్దగా ఆధారాలు లభించక పోవడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఖంగు తిన్నట్లు చెబుతున్నారు. దాడులు ముగిసి 35 గంటలు దాడుతున్నా ఇప్పటి వరకు ఐటి అధికారులు సహితం ఈ దాడులపై పెదవి విప్పడం లేదు. అక్రమ ఆస్తులు ఏమేరకు కనుగొన్నారో చెప్పడం లేదు.

పైగా, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెచ్చి పోయారు. ఏకంగా కెసిఆర్ కుటుంభ సభ్యుల ఆస్తులపై సవాల్ విసిరారు. కెసిఆర్ కు దమ్ముంటే తనతోపాటు ఆయన ఆస్తులపై విచారణకు ముందుకు రావాలని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుంచి తన ఆస్తులతోపాటు టీఆర్‌ఎస్‌ పెట్టిన రోజు నుంచి నేటి వరకూ ఉన్న ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధపడదామని కేసీఆర్‌ను చాలెంజ్‌ చేశారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాయడానికి తాను సిద్ధమని, ఒకవేళ తన సవాల్‌పై 24 గంటల్లోగా స్పందించకపోతే కేసీఆర్‌ అవినీతిపరుడని ఒప్పుకున్నట్లేనని వ్యాఖ్యానించారు.

కెసిఆర్ అరెస్ట్ కు తొందర పడుతున్నారని అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేయడం, ఎంపి బల్క సుమన్ ఎదురు దాడికి దిగడం మినహా కెసిఆర్ గాని, ఆయన కుమారుడు కేటిఆర్ గాని, కుమార్తె కవిత గాని ఇప్పటి వరకు రేవంత్ సవాల్ పై స్పందించక పోవడం గమనార్హం. ఒకవిధంగా కెసిఆర్ కుటుంభాన్ని రేవంత్ ఆత్మరక్షణలో పడవేసిన్నట్లు స్పష్టం అవుతున్నది.

నిజంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటి దాడుల్లో ఏమైనా దొరికి ఉంటె, కేంద్ర విచారణ సంస్థలు నిగ్గుతేల్చగల అక్రమాలు ఆయన ఏమైనా చేసి అంటే అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అంత దూకుడుగా మాట్లాడే అవకాశం ఉండబోదని భావిస్తున్నారు. అసలు రామారావు అనే న్యాయవాది రేవంత్ రెడ్డి `అక్రమ ఆస్తులు’ గురించి ఫిర్యాదు చేసింది సిబిఐకి అయితే దాడులు జరిపినది ఇటి అధికారులు కావడంతో దాడులు కేవలం వోట్ కు నోట్ కేసులో ఆధారం కోసమే జరిపిన్నట్లు భావించ వలసి వస్తున్నది.

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తామని స్వయంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీపై పార్టీలో చేరిన రేవంత్ కు అంతటి ప్రాధాన్యత గల పదవి ఇవ్వకుండా తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులే అడ్డుకున్నారు. దానితో ఒక్కరుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ముగ్గురుగా చేసి, వారిలో ఒకరిగా చేసి `నీకేమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు’ అని సంకేతం ఇచ్చారు. దానితో ఒకవిధంగా అసంతృప్తితో రగాలి పోతూ, కాంగ్రెస్ లో ఒంటరిగా భావిస్తున్న తరుణంలో ఈ దాడులు రాజకీయంగా రేవంత్ కు ప్రాధాన్యత కల్పించిన్నట్లు కనిపిస్తున్నది.

పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ దాడులను `కక్ష సాధింపు’ చర్యలు అంటూ రేవంత్ కు బాసటగా నిలబడడంతో విశేష ప్రచారం లభించింది. దానితో కెసిఆర్ ఆశించింది ఒక్కటయితే జరిగింది మరొకటి అన్నట్లుగా మారింది. వాస్తవానికి పలువురు కాంగ్రెస్ నేతలపై అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన పలు కుంభకోణాల గురించి ప్రభుత్వం వద్ద స్పష్టమైన నివేదికలు ఉన్నా వారెవ్వరికి ఇబ్బంది కలిగించే విధంగా కెసిఆర్ వ్యవహరించలేదు.

అయితే రేవంత్ రెడ్డి విమర్శలకు తట్టుకోలేక నాలుగేళ్ళుగా అసెంబ్లీ సమావేశాలలో దాదాపు పాల్గోననీయకుండా `బహిష్కరిస్తూ’నే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో జైలుకు పంపడానికి విఫల యత్నం చేసారు. అటువంటి సమయంలో ఇటి సోదాలు రేవంత్ కు ఒకవిధంగా ఎన్నికల సమయంలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగించిన్నట్లు పలువురు భావిస్తున్నారు.