6 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6 నుండి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.  ఈ నెల 16న జరిగిన మంత్రి మండలి సమావేశంలోనే శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన తర్వాతనే సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. 

పట్టణ ప్రగతి కార్యక్రమం ఈనెల 24న ప్రారంభమై మార్చి 4వ తేదీన (10 రోజులు) ముగియనున్నాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉండటంతో ఈ కార్యక్రమం ముగిసిన తర్వాతనే శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం మార్చి 6వ తేదీ (శుక్రవారం) నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

మొదటిరోజు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు ఆదివారం, సోమవారం (హోళి) సెలవు దినాలు కావడంతో సభ తిరిగి మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 

మంగళ, బుధవారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ముగించి గురువారం (విధియ) మంచి దినం కావడంతో సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెడుతారు. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి ఒక రోజు సభకు విరామం ఇస్తారు. 

శనివారం, ఆదివారం రెండు రోజులు సభకు సెలవు దినాలు కావడంతో తిరిగి సోమవారం నుంచి బడ్జెట్ పద్దులపై చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడుతాయి. 

శాసనసభ ప్రారంభం, బడ్జెట్ ప్రవేశ పెట్టడం, ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం, సభ నిర్వహించే పని దినాలపై (12 లేక 16) ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎం నిర్ణయం తీసుకున్న తర్వాత శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పష్టత రానుంది.