తెలంగాణలో ప్రత్యామ్నయ రాజకీయ శక్తిగా బిజెపి 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నయ రాజకీయ శక్తిగా బిజెపి  అవతరించిందని, అలాగే ఏపీలోనూ త్వరలో మార్పులు రాబోతున్నాయని మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లనుందని గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం తెలిపారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి నూతన అధ్యక్షులు రాబోతున్నారని చెబుతూ ఎవరు అధ్యక్షుడు అయినా అందరిని కలుపుకుని ముందుకు వెళతామని భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తుతూ సీఏఏలో ఎలాంటి ఇబ‍్బందులు లేనప్పటికీ రాజకీయ అవసరాల కోసమే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లీస్‌లు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. 

ఆర్టికల్‌ 370, రామ మందిరం, ట్రిపుల్‌ తలాక్‌ వంటి అంశాలలో ప్రధాని నరేంద్ర మోదీకి వస్తున్న ఆదరణ చూడలేకే సీఏఏపై వివాదం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. వీటిని అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. 

జాతి సమైక్యతకు ఎన్నార్సీ, సిఏఏ,  ఎన్పీఆర్‌ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. ముస్లిం యువత జాతీయ జెండాతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని చెబుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం యువత వందేమాతరం, జనగణమణ ఆలపించి కార్యక్రమాన్ని ముగించగలరా? అని ప్రశ్నించారు. 

తెలంగాణలో సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పోరాటం చేస్తుందని రావు ప్రకటించారు. కర్ణాటక, మహారాష్ట్రలో జరుగుతున్నప్పటికీ తెలంగాణలో జరగకపోవడం సరికాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాతృభాషను ఘనంగా జరుపుకుని తెలుగు భాషను పరిరక్షించుకోవాలని పిలుపిచ్చారు. 

మాతృభాష ఔన‍్నత్యాన్ని చాటిచెప్పడమే లక్ష్యంగా రేపు హైదరాబాద్‌ వేదికగా కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. ఇంట్లో ఒక భాష, పాఠశాలలో ఒక భాష ...ఇలా విద్యార్థులలో సంఘర్షణ లేకుండా చూడాలని సూచించారు.