కరోనా నేపథ్యంలో పరిశ్రమకు కేంద్రం అభయం  

దేశీయ పరిశ్రమపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం త్వరలోనే పలు చర్యలను తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. చైనాలో విలయం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్‌.. దేశీయ పరిశ్రమను ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నదానిపై, ప్రస్తుత పరిస్థితులపై వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఫార్మా, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ హార్డ్‌వేర్‌, సోలార్‌, ఆటో, సర్జికల్‌ ఎక్విప్‌మెంట్‌, పెయింట్‌, ఫర్టిలైజర్‌, టెలికం, గ్లాస్‌, మొబైల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, వంట నూనెలు, షిప్పింగ్‌, టూరిజం రంగాల ప్రతినిధులు దీనికి హాజరైయ్యారు. సమావేశం అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ ఔషధ, సౌర, రసాయన పరిశ్రమల నుంచి కొన్ని రకాల ఆందోళనలు వినిపిస్తున్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. 

ఎగుమతులు, ముడి సరుకు దిగుమతుల సమస్యలను తమ దృష్టికి తెచ్చారని ఆమె పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయంతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కాగా, బుధవారం వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో తాను సమావేశం అవుతానని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆ తర్వాత తగిన చర్యలను ప్రకటిస్తామని చెప్పారు. 

కాగా, వివిధ రకాల ఉత్పత్తుల ధరల పెరుగుదల గురించి ఆందోళనలు అవసరం లేదన్న నిర్మలా సీతారామన్‌.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’పై కరోనా ప్రభావం గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఔషధాలు, వైద్య పరికరాల కొరత ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. 

అయితే చైనాలో ఇప్పుడున్న భయానక పరిస్థితులు ఇలాగే మరికొంతకాలం కొనసాగితే కీలక ఔషధాల ధరలు పెరుగవచ్చని జైడస్‌ గ్రూప్‌ చైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ తెలిపారు. అక్కడి నుంచి వచ్చే దిగుమతులు ఇలాగే ఆగిపోతే ఇబ్బందులేనని చెప్పారు.