రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్న తెలంగాణ 

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం పట్ల కేంద్ర రైల్వే మంత్రి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని దుయ్యబట్టారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్రాలు వ్యతిరేకించలేవని కపిల్ సిబల్ కూడా అన్నారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. పక్క దేశాల్లో మతహింసకు గురవుతోన్న వారికి ఆశ్రయమిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఒవైసీ మెప్పుకోసం కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 

రాజకీయాల కోసమే ముస్లింలకు కేసీఆర్ 12శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని ఆరోపించారు. ప్రజలను అసదుద్దీన్ ఒవైసీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కూతురు కవితను ఓడించటం ద్వారా ప్రజలు టీఆర్ఎస్‌కు గట్టి సంకేతం పంపారని గుర్తు చేశారు. 

కేంద్రంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ  అవగాహన లోపంతోనే కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.  నేడు లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసైన రోజు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తుచేశారు. తెలంగాణకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణం అని చెప్పుకొచ్చారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.2,602 కోట్లు కేటాయించామని వెల్లడించారు. 

చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి పీయూష్‌ గోయల్‌ శంకుస్థాపన చేశారు. అందుకోసం కేంద్రం రూ. 221 కోట్లు కేటాయించింది.  దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. యర్రగుంట్ల - నంద్యాల సెక్షన్‌ విద్యుదీకరణకు గోయల్‌ శంకుస్థాపన చేశారు. గుంతకల్లు - కల్లూరు సెక్షన్‌ రెండో మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రిమోట్‌ లింక్‌ ద్వారా ప్రారంభించారు.