అమరావతి బాండ్లలో చంద్రబాబు అడ్డంగా దొరికిన్నట్లా !

తాను నిప్పు లాంటి వాడినని, అవినీతి-అక్రమాలే ఎరుగానని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ చెప్పుకొంటూ ఉంటారు. తన ప్రభుత్వంపై అనేక భారీ అవినీతి ఆరోపణలు వస్తున్నా ఇప్పటికే ఏ కోర్ట్ లో కుడా విచారణకు రాక పోవడంతో తనను తాను దోరగా ప్రచారం చేసుకొంటూ ఉంటారు. అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం గురించి ఘనంగా ప్రచారం చేసుకొంటూ రైతుల నుండి దాదాపు `ఉచితంగా’ సేకరించుకున్న సంవత్సరానికి ముదుకు పైగా పంటలు పండే సాగు భూములను కార్పోరేట్ సంస్థల ధారాదత్తం చేసి భారీగా నల్లదనం ఏరులై పారుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా జారీచేసిన అమరావతి బాండ్ల జారీ విషయంలో భారీ లొసుగులు జరిగిన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో మరే ప్రభుత్వం ఇవ్వలేని విధంగా 10.32 శాతం వడ్డీ చెల్లించడానికి ఒప్పుకోవడం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం, తద్వారా రూ 2,000 కోట్లను సేకరించడం అంతా చంద్రబాబును చూసి కొన్నరనే ప్రచారం కూడా చేసుకొంటున్నారు. అయితే వాటిని ఎవ్వరు కొన్నారు అని అడిగితే మాత్రం ఎదురు దాడికి దిగుతున్నారు. ఆ మాటను దాటవేస్తున్నారు. ఈ బాండ్ల విషయమై కేంద్రం దర్యాప్తుకు పునుకొనే అవకాశం ఉన్నదని, అదే జరిగితే చంద్రబాబునాయుడు ఇబ్బందులలో పడటం ఖాయమని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వమే ఈ సంవత్సరం ప్రారంభంలో 8 శాతానికి మించి వడ్డీ చెల్లించరాదని జరీ చేసిన జివోను దిక్కరిస్తూ ఈ విధంగా వడ్డీ చెల్లింపుకు ఒప్పుకోవడంపై పెను దుమారం చెలరేగుతున్నది. రాజధాని నిర్మాణం పనులకోసం సీఆర్‌డీఏకు 8 శాతం లోపు వడ్డీకి అప్పులు పుట్టకపోతే వాణిజ్య బ్యాంకుల నుంచి 8 శాతం లోపు వడ్డీకి రుణం ఇప్పించేందుకు ఆర్థిక శాఖే సంప్రదింపులు జరుపుతుందని స్పష్టం చేయగా, 8 శాతం వడ్డీలోపే అనే షరతును అమరావతి బాండ్ల జారీ విషయంలో సీఆర్‌డీఏ ఉల్లంఘించడం సర్వత్రా పలు అనుమానాలకు దారితీస్తున్నది.

ఇలా ఉండగా, 10.32 శాతం వడ్డీకి హామీ ఇస్తూ ఇప్పటికే బాండ్ల ద్వారా రూ 2,000 కోట్లను సేకరించగా, మరో రూ 500 కోట్ల సేకరణకు సిద్దపడుతున్నారు. అమరావతి బాండ్ల కొనగోలుదారుల పేర్లు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని బిజెపి ఎంపి జీవీఎల్‌ నరసింహారావు తరచూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివరాలను ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలను రహస్య పత్రాలుగా చెబుతూ జీవోలను బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నాని జీవీఎల్‌ పేర్కొన్నారు. ఇవన్నీ చెబితే ప్రజలు చీత్కరించుకుంటారని భయపడుతున్నారని విమర్శించారు.

కాగా, ఈ అంశం కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ దృష్టికి కుడా వెళ్లిన్నట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై ఆర్ధిక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను ఫోన్ చేసి మాట్లాడారు. అదే స‌మ‌యంలో ఈ బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన వారి వివ‌రాలు కూడా పంపాల‌ని ఆదేశించారు. కేంద్రం బీఎస్ఈ నుంచి కూడా ఈ వివ‌రాలు తెప్పించుకుంటోంది.  బాండ్లలో ఎవ్వరు పెట్టుబడులు పెట్టారనే అంశంపై కేంద్రం లోతుగా ఆరా తీస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల కధనం ప్రకారం  ఓ బ‌డా సంస్థ పెట్టిన పెట్టుబ‌డిలో 42 శాతం నిధులు ఏకంగా ఏపీ ఐటి శాఖ‌లో అన‌ధికారికంగా చ‌క్రం తిప్పుతున్న‌వారి కుటుంభం నుంచే వ‌చ్చాయ‌ని కేంద్రానికి ఫిర్యాదులు అందిన‌ట్లు తెలిసింది. అంటే ఇది ఖ‌చ్చితంగా అవినీతి సొమ్మే అన్న అనుమానం కేంద్ర వర్గాల్లో వ్య‌క్తం అవుతోంది.  అవినీతి సొమ్మునే అధిక వ‌డ్డీ ద‌క్కించుకునేందుకు మ‌ళ్లీ అమ‌రావ‌తి బాండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టార‌ని ఆరోప‌ణ‌లు విన్పిస్తున్నాయి.

రూ 2000 కోట్ల బాండ్ల‌లో రూ 1300 కోట్లు ఏపీ ప్ర‌భుత్వ నుంచి అనుచితంగా ల‌బ్దిపొందిన ఫ్లాంక్లిన్ టెంపుల్ట‌న్ పెట్టుబ‌డులు పెట్ట‌డం విశేషం. ఇందులోనే ఏదో గోల్ మాల్ జ‌రిగింద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వంద‌ల కోట్ల రూపాయ‌ల విలువ చేసే భూముల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఈ సంస్థ‌కు కారుచౌక‌గా క‌ట్ట‌బెట్టింది. ఇదే పెద్ద కుంభకోణం అని భావిస్తుండగా ఇప్పుడు బాండ్ల వ్య‌వ‌హారం కూడా ఓ పెద్ద కుంభకోణంగా మారే అవకాశం ఉన్నట్లు ఎపి ప్రభుత్వంలోని ఆర్ధిక శాఖ అధికారులే చెబుతున్నారు. 

వాస్తవానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం నుండి అడ్డదిడ్డంగా వస్తున్న అనేక ప్రతిపాదనలను ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు నిష్కర్షగా తిరస్కరిస్తున్నారు. గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి అక్రమాలకు బాసటగా నిలచిన పలువురు సీనియర్ అధికారులు ఇప్పటికి కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ ఉండటం తెలిసిందే. అందుకనే ముందు జాగ్రత్తగా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు వారి అభ్యంతరాలను లెక్క చేయకుండా, మంత్రివర్గంలో ఆమోదం పొందేటట్లు చేస్తున్నారు.