కరొనను ఎదుర్కోవడంలో చైనాకు భారత్ చేయూత 

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)తో అల్లాడుతున్న చైనా కు వైద్య సాయం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. చైనా లో కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న వుహాన్‌ నగరానికి ఔషధాలు, వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక సహాయ విమానాన్ని పంపనుంది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో భారతీయులతోపాటు ఇరుగుపొరుగు దేశాల వారినీ తీసుకు రానున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. 

క‌రోనా వైర‌స్ వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య 1868కి చేరుకున్న‌ది. కోవిడ్‌-19 వ్యాధి రోజు రోజుకూ విస్త‌రిస్తున్న‌ది. క‌రోనా వైర‌స్ సోకిన వారిలో సుమారు 12వేల మంది పేషెంట్లు కోలుకున్న‌ట్లు అధికారులు చెప్పారు. చైనాలో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 72వేల 436 కేసులు న‌మోదు అయ్యాయి. దీంట్లో 11 వేల మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  

క‌రోనా కేంద్ర బిందువైన హుబేయ్ ప్రావిన్సులోనే అత్య‌ధిక మ‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రావిన్సులో చాలా వ‌ర‌కు ప్రాంతాల‌ను క్వారెంటైన్ చేశారు. దిగ్భంధం వ‌ల్ల ల‌క్ష‌లాది సంఖ్య‌లో జ‌నం ఎటు వెళ్ల‌కుండా ఉండిపోయారు.  అయితే హుబేయ్ ప్రావిన్సు మిన‌హా మిగితా దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజువారీగా త‌గ్గుతున్న‌ట్లు జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.   

కరోనా వైరస్‌ వల్ల టాయిలెట్‌ పేపర్‌ కొరత ఏర్పడనున్నదన్న వదంతుల నేపథ్యంలో ఒక సాయుధ ముఠా.. ఓ సూపర్‌ మార్కెట్‌ నుంచి టాయిలెట్‌ రోల్స్‌ను ఎత్తుకెళ్లారు. అయితే వాటిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

జపాన్‌ తీరంలో నిలిపి ఉన్న క్రూయిజ్‌ నౌకలో మరో 99 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలోని 454 మంది నావికులకు వైరస్‌ సోకినట్లు తేలింది.