వైసిపి, టిడిపిలకు స్వప్రయోజనాలే పరమావధి

రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి పార్టీలకు తమ స్వప్రయోజనాలే పరమావధిగా మారాయని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధికి విఘాతం కలుగుతోందని  బిజెపి మహిళా మోర్చా జాతీయ ఇన్‌ఛార్జి, కేంద్ర మాజీ మంత్రి  దగ్గుబాటి పురంధ్రీశ్వరి రాజమహేంద్రవరంలో విమర్శించారు. జగన్‌, చంద్రబాబులు  వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టడంలేదని విమర్శించారు.

రాజధాని తరలింపు, మండలి రద్దు, విద్యుత్ పీపీఏల రద్దు, పోలవరం టెండర్లు రద్దుచేసి, రివర్స్ టెండర్లు పిలవడం తదితర అంశాలను చూస్తే వైసీపీ ప్రభుత్వానికి ప్రజాహితంపై శ్రద్ధ ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ధ్వజమెత్తారు. 

మండలిని రద్దు చేస్తామని తొలి సమావేశాల్లోనే ఎందుకు చెప్పలేదని ఆమె ప్రశ్నించారు. రాజధాని తరలింపునకు అడ్డం వస్తోందనే మండలిని రద్దు చేయాలని నిర్ణయించడం తగదని హితవు చెప్పారు. వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వెళుతోందని మండిపడ్డారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా విఫలమైందని ఆమె దుయ్యబట్టారు. 

రానున్న స్థానిక సంస్థల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుని సత్తా చాటుతామని ఆమె భరోసా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. తమ పార్టీకి జనసేన మినహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అంతర్గత సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెబుతూ  ప్రస్తుత రాజకీయ పరిణామాలను కూడా సమీక్షిస్తామని ఆమె తెలిపారు.