బైంసా బాధితులకు కిషన్ రెడ్డి భరోసా  

బైంసాలో ఓ వర్గం ప్రజలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖందిస్తూ బాధితులకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణలో బిజెపికి చెందిన మిగిలిన ముగ్గురు ఎంపీలతో కలసి ఆయన ఆదివారం భైంసా సందర్శించి బాధితులను పరామర్శించారు.  మజ్లిస్​ పచ్చి మతోన్మాద పార్టీ అని, భైంసా ఘటనకు అదే కారణమని, ఆ పార్టీకి టీఆర్​ఎస్  అండదండలు ఉన్నాయని ఆరోపించారు. 

అల్లర్లు జరిగిన కొర్బా గల్లీని పరిశీలించిన కిషన్ రెడ్డి బాధితులతో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భైంసా అల్లర్లపై కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు. 

ఈ ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ల నెల జీతాలతో పాటు తన విరాళం కూడా కల్పి మొత్తం రూ 20 లక్షల ఆర్ధిక సహాయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రకటించారు.    

కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ అయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‍రెడ్డి అన్నారు. ఆ రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని శాసిస్తున్నాయని, ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఆ కుటుంబాల కోసం కాదని తెలిపారు.  

కాగా, వారితో పాటు పర్యటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఈ ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని ప్రకటించారు. అల్లర్లు మజ్లిస్ కుట్రేనని ఆరోపించారు. మజ్లిస్ కు టీఆర్ఎస్ వత్తాసు పలుకుతుందని ధ్వజమెత్తారు.  బాధితులను కొత్త ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఘటన జరిగి ఇన్ని రోజులైన కేసీఆర్, కేటీఆర్ స్పందించకపోవడం దారుణమని ఎంపీ డి  అర్వింద్ దుయ్యబట్టారు. కేసీఆర్ కు ఎన్నికలప్పుడే హిందువులు గుర్తోస్తాని విమర్శించారు. జిల్లా యంత్రాంగం మీద పూర్తిగా నమ్మకం పోయిందని చెప్పారు. 

వందల మంది వ్యక్తులు తమపై రాల్లు, పెట్రోలుతో దాడులు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలు కూడ మంటల్లో కాలిపోయాయని చెప్పారు. అనుక్షణం భయంతో బతుకుతున్నామని పేర్కొన్నారు.