రాష్ట్రంలో ఎవరైనా జైలుకు వెళ్లే అవకాశాలు 

రాష్ట్రంలో ఎవరైనా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ కార్యదర్శిపై ఐటీ దాడులను ప్రస్తావిస్తూ దాడుల్లో వెలుగుచూసిన షెల్ కంపెనీలు ఎవరివి, ఎవరు స్థాపించారన్న అంశాన్ని వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఏపీ మాయామశ్చీంద్రలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఐటీ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు ప్రత్యేక నిఘా ఉంచాయని, త్వరలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 

కాగా, వైసిపితో బిజెపి పొత్తు అన్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు జనసేనతోనే మితృత్వం ఉందని, వారితోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని వెల్లడించాయిరు. టిడిపితో గానీ, వైసిపితో గానీ ఎటువంటి పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. 

హైదరాబాద్‌ను పాలకులు ఎంతో అభివృద్ధి చేశారని, రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ఆస్థాయి నగరం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈపరిస్థితి మరోసారి ఉత్పన్నం కాకూడదన్నదే తమ అభిమతమని చెప్పారు. 13 జిల్లాలను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిపై ప్రత్యేక ప్రేమ కనపరిచారని, ఇప్పుడు జగన్ మూడు రాజధానులంటున్నారని సోము విమర్శించారు. ఆనాడు అమరావతిని, నేడు మూడు రాజధానులను ప్రజలెవరూ కోరుకోలేదని స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధిచేసిన చంద్రబాబునాయుడు కుమారుడు అక్కడ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈనెల 20న విజయవాడలో రాష్టస్థ్రాయి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రధాని నరేంద్రమోడీ విశేషంగా కృషిచేస్తున్నారని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో ప్రతీ ఇంటికి కుళాయి, రోడ్లు, స్వచ్చ్భారత్ కింద పారిశుద్ధ్యం, ఇంటింటికీ మరుగుదొడ్లు, ఎల్‌ఈడీ దీపాలు, నిరంతర విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు, ఇళ్లు ఇలా అన్ని పథకాలు కేంద్ర నిధులతోనే అమలవుతున్నాయని పేర్కొన్నారు. అయితే గతంలో పాలించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లు తామే అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్భాటం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కోనసీమ రైల్వే నిర్మాణానికి ఇప్పటి వరకురూ  7-8వేల కోట్లు కేంద్రం కేటాయించిందని చెబుతూ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు, అమలుచేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.