బిజెపి ప్రచారంలో కీలకం కానున్న ‘సెల్‌ఫోన్ ప్రముఖ్’

2019 ఎన్నికల ప్రచారంలో బిజెపి వినూత్న రీతులలో జనం మధ్యకు దూసుకుపోయెందుకు ప్రయత్నం చేస్తున్నది. సాంప్రదాయ ప్రచారానికి భిన్నంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో డిజిటల్ ప్రచారాన్ని మరే పార్టీ కుడా అందుకోలేనంత విస్తృత స్థాయిలో చేపట్టడం కోసం భారీ సన్నాహాలు చేస్తున్నది. వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించారు.

పోలింగ్ బూత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ఓటర్లను గుర్తించాలని అమిత్ షా బీజేపీ కార్యకర్తలకు ఇప్పటికే సూచించారు. ఈ ప్రచారంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ‘సెల్‌ఫోన్ ప్రముఖ్’ కీలకం కానున్నారు. ఎన్నికల కోసం 9,27,533 పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్లకు వీడియోలు, ఆడియోలు, టెక్ట్స్, గ్రాఫిక్స్ , కార్టూన్ల ద్వారా ప్రచారం చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రచారానికి బీజేపీ ‘సెల్‌ఫోన్ ప్రముఖ్’ పేరిట ఒకొక్క పోలింగ్ కేంద్రంకు ఒకొక్క కార్యకర్త ఓటర్లను గుర్తించేందుకు ఏర్పాటు చేసుకొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా సెల్‌ఫోన్ ప్రముఖ్ లను గుర్తించి వారితో మూడు గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా డిజైన్ లు వేసి తయారు చేసిన ప్రచార సామగ్రిని వీరు విస్తృతంగా ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తారు.

ఒకొక్క పోలింగ్ బూత్ పరిధిలో సుమారు వేయి మంది వోటర్లు ఉండగా, వారందరికీ ఈ ప్రచారం చేరే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రచారం కోసం వీడియో, ఆడియో, టెక్స్ట్, గ్రాఫిక్, కార్టూన్ లను ఉపయోగిస్తారు. ఈ ప్రముఖులు అందరికి ఒకొక్క స్మార్ట్ ఫోన్ ఇస్తారు. మూడు వారల క్రితం సీనియర్ బిజెపి నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన సమావేశంలో ఈ కార్యక్రమం వివరాలను వారందరికీ వివరించారు. ఇప్పటికే “బూత్ యాక్షన్ ప్లాన్” ను అమిత్ షా రుపొందిచారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న వోటర్ల జాబితాను తాయారు చేయమని ఇప్పటికే రాష్ట్ర పార్టీ శాఖలను కోరారు. ఈ జాబితాలు సిద్దం కాగానే ఢిల్లీలో అశోకరోడ్ లో గల పార్టీ పాత కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన `వార్ రూమ్’ కార్యాచరణ ప్రారంభిస్తుంది. మొదటి దశలో ఈ ‘సెల్‌ఫోన్ ప్రముఖ్’ లుగా పనిచేసే కార్యకర్తలను గుర్తించమని పార్టీ ఎంపిలు, ఎమ్యెల్యేలు, ఇతర ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పదాదికారులను కోరారు. తర్వాత, ఈ ప్రణాళిక ప్రకాటం ఒకొక్క పోలింగ్ స్టేషన్ కు మూడు వాట్స్ అప్ గ్రూప్ లను ఏర్పాటు చేస్తారు. ఈ వేదికపై అత్యధికంగా అనుమతించే విధంగా ఒకొక్క గ్రూప్ కు 256 మంది ఓటర్లను కేటాయిస్తారు.

కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మూడు వాట్స్ అప్ గ్రూప్ లను ఏర్పాటు చేయడం సాధ్యం కాని పక్షంలో నోడేల్ వ్యక్తి కనీసం ఒక గ్రూప్ ను ఏర్పాటు చేస్తారు. భారత దేశంలో మొదటిసారిగా 2014 ఎన్నికలలో దేశం వ్యాప్తంగా గల 9.27 లక్షల పోలింగ్ కేంద్రాలలో విస్తృతంగా సోషల్ మీడియాను ప్రచారం కోసం వాడుకోవడం జరిగింది. ఈ సారి ఈ కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

రాబోయే ఎన్నికలలో పోరాటం ప్రధానంగా వాట్స్ అప్ వేదికగా జరుగుతుందని భావిస్తున్నారు. అందుకోసం బిజెపి భారీ సన్నాహాలు చేస్తున్నది. ఈ వేదికపై ప్రచారాన్ని జనవరి నుండి ప్రారంభించబోతున్నది. భారత దేశంలో 11.4 బిలియన్ మొబైల్ ఫోన్ లు ఉన్నాయి. ఆ ఫోన్లు గలవారిలో కనీసం 20 కోట్ల మందికి వాట్స్ అప్ ఖాతాలు ఉన్నాయి.

కాగా, పేస్ బుక్ ఆధారంగా పంపే సందేశాల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే ప్రమాదం ఉన్నాడని ఎన్నికల కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అటువంటి వార్తలు సాముహిక దాడులకు, సాముహిక హింసాయుత చర్యలకు దారితీసే అవకాశం ఉన్నదని ఇటి మంత్రిత్వ శాఖ కుడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దృష్ట్యా ఇటువంటి సందేశాలను వ్యాప్తి చేయడాన్ని నిరోధించడం కోసం వాట్స్ ఆప్ సహితం కొన్ని మార్పులు తీసుకు వచ్చింది.

ఈ ప్రచారం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రచార సామగ్రిని తయారు చేయడం కోసం బిజెపి జాతీయ ఇటి సెల్ ప్రసిద్ది చెందిన కంపెనీల సేవలను ఉపయోగించుకో బోతున్నది. ముఖ్యంగా బిజెపి ప్రభుత్వాలు చేబడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రధాని మోడీ విజయాలు, ట్రిపిల్ తలాక్, రామమందిరం వంటి పార్టీకి కీలకమైన అంశాలను ఈ ప్రచారంలో ఉపయోగించు కొంటారు.

దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల `వార్ రూమ్’లకు వీటిని పంపిస్తారు. వారి ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో నీయమించే ‘సెల్‌ఫోన్ ప్రముఖ్’ లకు పంపిస్తారు. వారు తాము నిర్వహిస్తున్న వాట్స్ అప్ గ్రూప్ ల ద్వారా వోటర్లు అందరికి చేరేటట్లు చూస్తారు. గతవారం రాజస్తాన్ లోని కోటలో జరిగిన పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ “సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండకుండా మీరు ఎన్నికలలో గెలుపొందలేరు” అంటూ అమిత్ షా పేర్కొన్నారు.

దేశంలో పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల బృందం ఉన్న పార్టీ బిజెపి మినహా మరొకటి లేదని చెప్పవచ్చు. గతంలో ఈ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి, పార్టీ ప్రచార కరపత్రాలు అందజేసి, వోట్లు వేయమని కోరేవారు. అయితే ఈ సారి ఈ పద్దతిని కొనసాగిస్తూనే ప్రధానంగా వాట్స్ అప్ గ్రూప్ ల ద్వారా వ్యక్తిగత వోటర్లకు మరింతగా చెరువు అయ్యేందుకు విస్తృతమైన ప్రయత్నం చేస్తున్నారు.