మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మ  

మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారి.. పాతబస్తీకి మెట్రో రాకుండా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో మెట్రో రైలు అధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ నగరంలో పాతబస్తీ చాలా వెనుకబడి ఉందని విచారం వ్యక్తం చేశారు. పాతబస్తీ అభివృద్ధిని కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. 

మెట్రో రావడం వల్ల పాతబస్తీ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కై పాతబస్తీకి మెట్రో రైలు రాకుండా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తయిందని, మెట్రోకు కేంద్రం రూ.1200 కోట్లు నిధులిచ్చిందని గుర్తుచేశారు. 

మరో రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెబతూ ఫలక్‌నూమా వరకు మెట్రో నిర్మాణం చేస్తామంటేనే కేంద్రం నిధులిచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో రైలు టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

కేంద్రంపై విమర్శలు చేయటమే పనిగా కేటీఆర్ పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇస్తుంది.. ఎన్ని ఇళ్లు కడతారో చెప్పండి అంటూ కేటీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చినా తన వాటా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. 

ఇదే సమయంలో ఎంఎంటీఎస్ రెండోదశ పనులపైనా కేంద్ర మంత్రి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫలం వలనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభం కావటంలేదని దయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కంటే ఎక్కువ నిధులు కేటాయింయించిందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వాటాను ఇవ్వలేదని చెప్పారు.

ఎంఎంటీఎస్ రెండోదశను ఇప్పటికైనా పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా కంటే అదనపు నిధులు ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే సహకరించడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.

కాగా, జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను పిలవలేదంటూ మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారుల తీరును తూర్పారబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే తనకు ఆహ్వానం పంపలేదని అసహనం వ్యక్తం చేశారు. మెట్రో ప్రారంభోత్సవం ఏమైనా టీఆర్ఎస్ ఫంక్షనా? అని ఫైర్ అయ్యారు. 

మెట్రో రైలు కోసం కేంద్రం రూ.1250 కోట్లు ఇచ్చిందని, కనీసం ప్రధాని ఫోటో అయినా పెట్టలేదని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గం పరిధిలో జరిగిన కార్యక్రమం గురించి తనకే చెప్పరా? అని అధికారులను కేంద్ర మంత్రి నిలదీశారు. ఇదిలాఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హాజరుకాలేదు.

మెట్రో రైలు అధికారులతో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వర మెట్రో రైలులో ప్రయాణించారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ నేతలు లక్ష్మణ్, మోత్కుపల్లి నరసింహులు, చింతల రామచంద్రారెడ్డి, మెట్రోరైలు అధికారులు ఉన్నారు.