మెట్రో రైలు ప్రారంభంపై బిజెపి ఆగ్రహం 

కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా హైదరాబాద్ మెట్రో రైలు మూడో దశను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రారంభించడంపై బిజెపి నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న జి కిషన్ రెడ్డిని ఆహ్వానించకుండా ఈ కార్యక్రమం జరపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

మెట్రో రైలులో కేంద్రం కూడా భాగస్వామి అయినా కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొదటి దశను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జేబీఎస్-ఎంజీబీఎస్‌ మెట్రో మార్గాన్ని ఈనెల 7న సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అధికారుల నుంచి ఆహ్వానం అందలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. పైగా, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో, ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించడమంటే ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చని బీజేపీ ముఖ్యనేతలు ఆరోపిస్తున్నారు. 

తనకు ఆహ్వానం పంపించకుండా మెట్రో అధికారులు ప్రోటోకాల్‌ ఉల్లంఘించారని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఇప్పటికే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని ఎండగట్టడం కోసం కిషన్ రెడ్డి మెట్రో రైల్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

మధ్యాహ్నం దిల్‌ఖుషా గెస్ట్‌హౌజ్‌లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌), ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు, మెట్రో ఉన్నతాధికారులతో కలిసి జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోలో ప్రయాణించి, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలింపనున్నారు.