డీఎస్‌ కుమారుడు సంజయ్‌ అరెస్ట్

 

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిజామాబాద్‌ నగర మాజీ మేయర్, టి ఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను పోలీసులు చిట్టచివరకు  అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంజయ్‌ ఆదివారం  నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. న్యాయవాది కృపాకర్ రెడ్డితో కలిసి విచారణకు వచ్చారు. విచారణ అనంతరం సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలని పోలీసులు సంజయ్ ఇంటికి ఈనెల 10న నోటీసులు అంటించారు. నోటీసుల్లో భాగంగా ఈరోజు న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. తమను లైంగికంగా వేధిస్తున్నారని శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు సంజయ్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసందే. సంజయ్‌పై 342, 354, 354A, 506, 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

సంజయ్‌ని ఏసీపీ సుదర్శన్ మూడు గంటలపాటు విచారించారు. లైంగిక ఆరోపణలపై ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. అయితే ఆదివారం కావడంతో సంజయ్‌ని పోలీసులు  మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఆదేశంపై వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. అనంతరం పోలీస్ రేమండ్ చేయనున్నారు.