రూ 2,000 కోట్ల కుంభకోణంలో చంద్రబాబుకు ఐటి ఉచ్చు? 

తెలుగు రాష్ట్రాల్లో రూ 2,000 కోట్ల విలువ గల భారీ కుంభకోణం బయటపడింది.  గతం వారం రోజుల నుంచి ఆదాయపన్ను సఖ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో సోదాలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 3 ఇన్ ఫ్రా కంపెనీల కార్యాలయాల్లో సోదాలు జరపగా.. బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు తెలిసింది.

బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్ ల ద్వారా సదరు కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు భావిస్తోంది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు  పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ కేంద్రంగా ఈ దాడులు జరగడంతో చివరకు ఈ ఉచ్చు టిడిపి అధినేతకు తగిలే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది. సోదాలు జరిగిన మూడు ఇన్ ఫ్రా కంపెనీలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌లకు సన్నిహితులైన  శ్రీనివాస్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కిలారు రాజేష్ లకు చెందినవిగా చెబుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు, బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్లను రాకెట్‌గా ఏర్పాటు చేసి.. భారీ నగదు కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటన రాజకీయ సంచలనం రేపింది. 

అధికంగా బిల్లులు చెల్లించినట్లు చూపడం (ఓవర్‌ ఇన్‌వాయిసింగ్‌), బోగస్‌ బిల్లులు సృష్టించడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఇందుకు సంబంధించి తిరుగులేని ఆధారాలను సేకరించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ స్పష్టం చేసింది.  ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించి, నిధులను దారి మళ్లించారని అధికారులు గుర్తించారు. పన్ను లెక్కలకు దొరకకుండా చిన్న మొత్తాల రూపంలోనే రూ.2 కోట్ల నిధులు దారి మళ్లాయని తెలిసింది.

ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామని.. గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు తెలిసిందని అధికారులు చెబుతున్నారు.ఈ ఐటీ దాడుల్లో రూ.85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల నగలు, 25 బ్యాంక్ లాకర్లు అధికారులు సీజ్ చేశారు.  

ముంబై కేంద్రంగా పని చేసే ఒక బడా కాంట్రాక్టు సంస్థ కార్యాలయంలో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో రూ.150 కోట్లకుపైగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యుడికి అక్రమంగా చేరినట్లు ఐటీ శాఖ ఇటీవల ప్రకటించింది. ఆ సంస్థలో నిర్వహించిన సోదాల్లో లభ్యమైన ఒక ఆధారంతో చంద్రబాబుకు సన్నిహితులైన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, ఆర్వీఆర్‌ ఇన్‌ఫ్రా, లోకేష్‌ బినామీ నరేన్‌ చౌదరికి చెందిన డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కార్యాలయాలపై ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన్నట్లు తెలుస్తున్నది.