కాంగ్రెస్ తల్లీకొడుకు పార్టీ..టీఆర్‌ఎస్‌  తండ్రీకొడుకు పార్టీ

రేజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తల్లి కొడుకు పార్టీ  అని,  టీఆర్‌ఎస్‌   తండ్రి,కొడుకు పార్టీ అని ధ్వజమెత్తారు. 

2012లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఎస్సి, ఎస్టీ  ఉద్యోగుల ప్రమోషన్ లలో రిజర్వేషన్లు కల్పించవద్దని కోర్టు కు వెళ్లిందని.. ఆ అంశంపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం రిజర్వేషన్లు కల్పించేది లేదని ప్రకటించిందని గుర్తు చేశారు. 

రిజర్వేషన్లు కల్పించవద్దంటూ కోర్టుకు పోయిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే అంశంపై ధర్నా చేస్తామనడం అవివేకమని, దళితులపై ముసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. తప్పుచేసిన కాంగ్రెస్.. బీజేపీని బదనాం చేసేందుకు కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందని,  

తెలంగాణ లో కూడా కాంగ్రెస్ దుకాణం బంద్ చేసుకుంటే మంచిదని చెప్పారు. దళితులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తే.. బీజేపీ మాత్రం దళితులకు అండగా ఉంటుందని తెలిపారు. దళితులకు ఎవరేమి చేశారో తేల్చేందుకు ఉత్తమ్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.