పాక్ స్థావరాలపై శతఘ్నులతో విరుచుకుపడిన భారత్ సైన్యం

హద్దులు దాటి పాశవికంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. మన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను అత్యంత దారుణంగా గొంతుకోసి చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దుల ఆవల పాక్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని శతఘ్నులతో విరుచుకుపడింది. శరపరంపరగా మన జవాన్లు కురిపించిన గుళ్ల వర్షంలో శత్రు దళాలు కకావికలమయ్యాయి. వారికి భారీగా ప్రాణనష్టం సంభవించింది.

‘‘ప్రతీకార సంఘటన ఒకటి జరిగింది. అదేంటన్నది ప్రస్తుతానికి  వెల్లడించను. నన్ను నమ్మండి. రెండు, మూడు రోజుల కిందట భారీ ఘటన జరిగింది. ఏం జరిగిందన్నది భవిష్యత్‌లో మీరే చూస్తారు’’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముజఫర్‌నగర్‌లో ప్రకటించారు. మిగతా వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే అది శతఘ్ని దాడి అని, అందులో పాక్‌ బలగాలకు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం సంభవించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ జవానును దారుణంగా హత్య చేసినందుకు పాకిస్థాన్‌కు భారత బలగాలు గట్టిగా బుద్ధిచెప్పాయని రాజ్‌నాథ్‌సింగ్ నర్మగర్భంగా పేర్కొనడం ద్వారా మరో లక్షిత దాడులకు పాల్పడిన్నట్లు స్పష్టం అవుతున్నది. ఇదే విషయాన్ని బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే కూడా ధ్రువీకరించారు. మరోవైపు పాకిస్థాన్‌పై కఠిన చర్యలు కొనసాగుతూనే ఉంటాయని రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొనడం గమనార్హం. అయితే ఆ దాడుల వివరాలను వెల్లడించడం లేదు.

కేంద్ర మంత్రులు, బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్థాన్‌పై మరో లక్షిత దాడి జరిగిందోమోనన్న ఆసక్తి నెలకొన్నది. కాగా మన బలగాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయన్నదానిపై తాను ఇప్పుడే ఏమీ వెల్లడించలేనని, ఈ విషయంలో తనను నమ్మాలని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.  హువా హై. ఠీక్ ఠాక్ హువా హై. విశ్వాస్ రక్‌నా. బహుత్ ఠీక్ ఠాక్ హువా హై. దో తీన్ దిన్ పహెలే (గుణపాఠం చెప్పాం.. నాపై విశ్వాసం ఉంచండి. రెండుమూడు రోజుల కిందట చాలా గట్టిగా గుణపాఠం చెప్పాం) అని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే ఇటువంటి చర్యలు భవిష్యత్తులో కూడా ఉంటాయని ఆయన ఉద్ఘాటించారు. గతంలో పాకిస్థాన్‌పై చేసిన లక్షిత దాడులకు సంబంధించిన రెండో వార్షికోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో రాజ్‌నాథ్‌సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘పాక్‌ మన పొరుగు దేశం కావడం వల్ల తొలి తూటాను మనం పేల్చరాదని మన బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు సూచించా. ఒకవేళ సరిహద్దుల వెంబడి కాల్పులు మొదలైతే.. ఎన్ని తూటాలు పేలుస్తున్నామన్నది పట్టించుకోకుండా దీటుగా సమాధానం చెప్పండని స్పష్టంచేశా’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

ఈ నెల 18వ తేదీన జమ్మూ ప్రాంతంలోని రామ్‌గఢ్‌లో బీఎస్‌ఎఫ్ జవాను నరేంద్రసింగ్‌ను పాక్ సైన్యం కాల్చిచంపడంతోపాటు పాశవికంగా గొంతు కోసింది. ఈ అనాగరిక చర్యకు పాల్పడినందుకు పాక్ ఆర్మీ, ఉగ్రవాదులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హత్య జరిగిన వెంటనే భారత ఆర్మీ ఛీప్ బిపిన్ రావత్ హెచ్చరించారు.

ఈ నెల 18వ తేదీన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ నరేంద్రసింగ్‌ను పాకిస్థాన్ పాశవికంగా హత్య చేసినందుకు తగిన ప్రతీకారం తీసుకున్నామని బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ మరోవంక ఢిల్లీలో వెల్లడించారు. అయితే తగిన ప్రతీకారం ఏమిటనేదానిపై పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు.

సరిహద్దుల వెంట పాకిస్థాన్‌పై తీవ్రమైన చర్యలు కొనసాగుతూనే ఉంటాయని రక్షణశాఖ నిర్మలాసీతారామన్ చెన్నైలో పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పామన్న హోంమంత్రి రాజ్‌నాథ్ తరహాలోనే రక్షణమంత్రి కూడా వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగించింది.

కాగా, కేవలం ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీ లక్షిత దాడులను ప్రశ్నిస్తూనే ఉన్నదని, తద్వారా దేశానికి, సైన్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. నమో యాప్ ద్వారా బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో మాట్లాడిన మోదీ లక్షిత దాడులు చేసిన మన వీరజవాన్లను గౌరవించుకునేందుకు పరాక్రమ్ పర్వ్‌ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.