బ్రాండ్ ఇండియా గుర్తింపు కోసం యువత కంకణం

బ్రాండ్ ఇండియా గుర్తింపు కోసం యువత కంకణం కట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపిచ్చారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ విద్యారంగంలో సంస్కరణలు సమర్థ నాయకత్వం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభిస్తూ దేశంలో సంపూర్ణ విద్య సాధనకు అధికారులు, ప్రజలు, స్వచ్చందసేవా సంఘాలు అంకితభావంతో పనిచేయాలని కోరారు.

విజ్ఞానం, విద్యను పుస్తకాలకు పరిమితం చేయరాదని చెబుతూ ప్రతి వ్యక్తి సంపూర్ణ వ్యక్తిత్వ సాధనకు విద్య దోహదపడుతుందని చెప్పారు. విద్యా ద్వారానే అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటామని స్పష్టం చేస్తూ సృజనాత్మకత లేని విద్య వ్యర్థమని తెలిపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, రామమనోహర్ లోహియా లాంటి మహనీయులు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేసారు. ఒక మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలంటే విద్య దిక్సూచి అని స్వామివివేకానంద అన్నారని పేర్కొన్నారు.

సృజనాత్మకత, కొత్త వస్తువుల ఆవిష్కరణ లేని పక్షంలో సమాజంలో సమతౌల్యత లోపిస్తుందని ప్రధాని హెచ్చరించారు. సమాజం చైతన్య వంతం కావాలంటే అందరికీ విద్య అందించాలని, విద్యా వ్యవస్థల మధ్య అనుసంధానం ఉండాలని స్పష్టం చేసారు. ఏ దేశం, సమాజం కూడా విద్య లేకుండా ప్రగతిశీల వాదం వైపు అడుగులు వేయలేదని చెప్పారు.  వివిధ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల మధ్య వివిధ అంశాలపై చర్చ, కొత్త అంశాలపై ఆనే్వషణపై సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం మార్పిడి జరగాలని ప్రధాని సూచించారు.

సమాజం కోసం మంచి ఉపాధ్యాయులను తయారు చేసుకోవాలని తెలిపారు. డిజిటల్ లిటరసీ ఫలాలను అందరికీ అందించాలని చెబుతూ ప్రాచీన విశ్వవిద్యాలయాలు తక్షశిల, నలందాలో విజ్ఞానం పంచుకోవడమనే భావన అమలు చేశారని గుర్తు చేసారు. దేశ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా విద్యార్థులను వర్శిటీలు, విద్యాసంస్థలు తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.