ఎంపిలో రాహుల్ కు అఖిలేష్ షాక్

ఉత్తరప్రదేశ్‌లోనే కాంగ్రెస్ ను పట్టించుకోకుండా బిఎస్పి అధినేత్రి మాయావతితో పొత్తు కుదుర్చుకున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇప్పుడు పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ లో సహితం మిత్రుడైన కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీకి షాక్ కలిగిస్తున్నారు. మరో రెండు నెలలో ఉన్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడం కోసం నానాతంటాలు పడుతున్న కాంగ్రెస్ తో సంబంధం లేకుండా పలు జిల్లాల్లో పార్టీ అభ్యర్ధులను పోటీకి దించుతున్నారు.

ఇప్పటికే 35 సీట్లు అడిగితే కాంగ్రెస్ నుండి తగు సమాధానం లేదని ఆగ్రహంతో బిఎస్పి అధినేత్రి మాయావతి రాష్ట్రంలోని అన్ని స్థానాలలో అభ్యర్ధులను పోటీకి పెడుతున్నట్లు ప్రకటించారు. యుపికి సరిహద్దు జిల్లాల్లో కొంత పలుకుబడి ఉండడంతో ఆయా జిల్లాల్లో స్వయంగా ఎన్నికల ప్రచారానికి అఖిలేష్ బయలు దేరారు. శని, ఆది వారాలలో పలు ఎన్నికల సభలలో ప్రసంగిస్తున్నారు. తద్వారా మధ్యప్రదేశ్ లో పార్టీని విస్తరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఈ పరిణామాలు సహజంగానే కాంగ్రెస్ అభ్యర్ధుల విజయావకాశాలను గండి కొత్తగలవు. అందుకనే కాంగ్రెస్ నాయకులు కలవరం చెందుతున్నారు.  షహదోల్, బాలాఘాట్ నియోజకవర్గాల్లో జరిగే పార్టీ ప్రచార సభల్లో అఖిలేష్ పాల్గొంటున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాజేంద్ర చౌదరి తెలిపారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిపై ప్రజలు విసిగెత్తిపోయారని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి శక్తియుక్తులతో పోటీ చేస్తుందని, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రాజేంద్ర చౌదరి చెప్పారు.