బీజేపీలో విలీనం కానున్న జేవీఎం-పీ  

జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం-పీ)ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ  ప్రకటించారు. జేవీఎం-పీ కార్యనిర్వాహక సంఘం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీలో విలీనమవుతున్నామని చెప్పారు. 

జేవీఎం-పీ అధ్యక్షుడు కూడా అయిన బాబూలాల్ మరాండీ మాట్లాడుతూ ఈ నెల 17న రాంచీలోని ప్రభాత్ తార మైదానంలో జరిగే కార్యక్రమంలో లాంఛనంగా ఇరు పార్టీలు ఏకమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. 

అంతకుముందు జేవీఎం-పీ కార్యనిర్వాహక సంఘం సమావేశంలో బాబూలాల్ మరాండీ ఓ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ బీజేపీలో జేవీఎం-పీ విలీనమవాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. 

బాబూలాల్ మరాండీ రాకతో గిరిజనుల మద్దతు పొందవచ్చునని బీజేపీ ఆశిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జార్ఖండ్ మొదటి గిరిజనేతర ముఖ్యమంత్రి, ఆయన గిరిజనులను ఆకట్టుకోలేకపోయారు. 2019లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గిరిజనుల ప్రాబల్యంగల స్థానాల్లో ఆధిక్యతను కోల్పోవడంతో  రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.