చైనాలో 1016కు చేరుకున్న కరోనా మృతులు 

ప్రాణాంతక కరోనా వైరస్‌ వల్ల ఇప్పటి వరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 1016 మందికి చేరుకున్నది. ఒక్క సోమవారమే 108 మంది మరణించగా, వారిలో 103 మంది హుబేయి రాష్ట్ర వాసులే. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 42,638 మందికి చేరుకున్నదని చైనా ఆరోగ్యాధికారులు తెలిపారు. 

వివిధ దేశాల్లో సోమవారం నాటికి మరణించిన వారి సంఖ్య 42కు, వైరస్‌ బాధితుల సంఖ్య 390కి చేరింది. కరోనా వైరస్‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు చైనా ఆరోగ్యాధికారులకు సహాయ సహకారాలందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిపుణులు బీజింగ్‌కు చేరుకున్నారు. 

కాగా, సోమవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌.. దేశ రాజధాని బీజింగ్‌లో పర్యటించారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌కు ‘కొవిద్‌-19’ అని డబ్ల్యూహెచ్‌ఓ కొత్త పేరు పెట్టింది. 

ఇందులో సీఓ అంటే కరోనా, వీఐ అంటే వైరస్‌, డీ అంటే వ్యాధికి గుర్తింపుగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అఢానోమ్‌ ఘేబ్రెయెసస్‌ మంగళవారం మీడియాకు చెప్పారు.