కరోనాపై పోరాటంలో చైనాకు సాయం చేస్తాం

కరోనా వైరస్‌తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో చైనా అధ్యక్షుడికి, ప్రజలకు మోడీ తన లేఖలో సంఘీభావం ప్రకటించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యాధి వ్యాప్తివల్ల వందలాది మంది మరణిస్తుండడం దురదృష్టకరమని పేర్కొంటూ ప్రధాని …ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు భారతదేశం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 

ప్రాణాంతకమైన కరోనా వైరస్ వల్ల చైనాలో ఇంతవరకూ 811 మంది మరణించారు. 37,198 కరోనా కేసుల్ని ధ్రువీకరించినట్టు చైనా అధికారులు తాజా సమాచారమందించారు. కరోనా వ్యాధికి కేంద్రంగా ఉన్న హుబెయి ప్రావిన్స్ నుంచి 650 మంది భారతీయులు స్వదేశం వెళ్లేందుకు ఏర్పాటు చేసినందుకు జీకి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 

రెండు దేశాల మధ్య కమ్యునికేషన్, సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా తాము సిద్ధంగా ఉన్నట్టు చైనా రాయబారి సన్ వీడాంగ్ ఒక ఇంటర్వూలో చెప్పారు. తమ దేశంలో ఉన్న భారతీయుల ఆరోగ్యం, భద్రతపట్ల జాగ్రత్త తీసుకుంటామని పేర్కొన్నారు.తమ ఆర్థిక వ్యవస్థపై తాత్కాలికంగా కొంతకాలం వరకూ కరోనా ఫలితం ఉంటుందని ఆయన అంగీకరించారు. 

అయితే, ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు తగిన వనరులు, విధానాలు తమ వద్ద ఉన్నాయన్నారు. హుబెయి ప్రావిన్స్ కరోనాకు కేంద్రంగా మారినా ఈ వ్యాధి చైనాలో దాదాపు ప్రతి ప్రావిన్స్‌కే కాక, ప్రపంచంలో 25 దేశాలకూ వ్యాపించింది. దాంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అత్యయిక పరిస్థితిని ప్రకటించింది.