అమిత్ షా పిలుపు మేరకే బిజెపిలో చేరా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపు మేరకే తాను బిజెపిలో చేరానని ప్రముఖ నటుడు బాబుమోహన్ తెలిపారు. అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆరే కారణమని తెలిపారు. మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, మంత్రిగా కూడా పనిచేశానని గుర్తుచేశారు. తనకు అబద్ధం ఆడటం చేతకాదని, కానీ ఎవరైనా తప్పు చేస్తే ఊరుకునే స్వభావం కాదని స్పష్టం చేశారు.

2014 ఎన్నికలకు ముందు కేసీఆర్, హరీశ్‌ రావులే తనను పిలిచారని, వాళ్ల పిలుపు మేరకు టీఆర్ఎస్‌లో చేరానని తెలిపారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి 4ఏళ్ల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజున తాను మిటింగ్‌లో ఉన్నానని చెప్పారు. ఓ మీడియా ప్రతినిధి వచ్చి అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారని, అందులో మీ పేరు లేదని చెప్పగానే బాధేసిందని పేర్కొన్నారు. 105 మందిలో తాను పనికిరానివాడినా? ఆ సంగతి అర్థం కావట్లేదని విస్మయం వ్యక్తం చేసారు. టికెట్ నిరాకరించడానికి కారణం ఏంటనీ కేటీఆర్‌ను అడిగితే సమాధానం లేదన్నారు. ఇక 25 రోజుల నుంచి ఎదురుచూస్తున్నా.. కేసీఆర్ నుంచి ఫోన్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్ని మెసేజ్‌లు పెట్టినా రెస్పాన్స్ లేదని చెప్పారు.

ఎప్పటినుంచో బీజేపీతో కలిసి పనిచేయాలన్న కోరిక ఉండేదని చెబుతూ టీఆర్ఎస్‌లో పనికిరానివాడిని... బీజేపీలో పనికొస్తానా? అంటూ ఆలోచిస్తున్న సమయంలో అమిత్ షా గారే పిలిచారని పేర్కొన్నారు. తనను రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయాలని కోరారన్నాని తెలిపారు.