చంద్రబాబు కన్నా జగన్ పై తీవ్ర ప్రజాగ్రహం   

గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దీ కాలంలోనే తీవ్ర ప్రజాగ్రహానికి గురవుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి విషయంలో కేంద్రంపై నెపాన్ని వేస్తున్నారని దుయ్యబట్టారు. 

అవినీతి, కుట్ర ప్రకారమే సీఎం జగన్ రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిని పీక్కుతింటే.. జగన్ దోచుకోవడానికి వైజాగ్ వెళ్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమాన్ని కుల పోరాటంగా చూపటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, న్యాయ పోరాటం కూడా చేస్తామని కన్నా వెల్లడించారు. రాజధాని తరలింపును విశాఖ ప్రజలు సైతం ఆహ్వానించటం లేదని స్పష్టం చేశారు. రాజధాని మార్పు విశాఖను ఉద్ధరించటానికి కాదని, అక్కడి భూములు దోచుకోవటానికే జగన్ వైజాగ్‌పై ప్రేమ చేపిస్తున్నారని ఆరోపించారు. 

విశాఖపై నిజంగా ప్రేమ ఉంటే ఆరేడు నెలలుగా ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్నా ప్రశ్నించారు. అమరావతి ఐదు కోట్లమంది ఏపీ ప్రజలకు సంబంధించిన అంశమని పేర్కొంటూ, ఒక్కడే దానిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు చెప్పారు. 

రాజధానులను మార్చుకుంటూ పోతే రాష్ట్రానికి పెట్టుబడులు రావని హెచ్చరించారు. జగన్ నియంతృత్వ ధోరణిని ఖండిస్తున్నామని చెబుతూ  అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని కన్నా పేర్కొన్నారు. అయితే పరిపాలన వికేంద్రీకరణకు బీజేపీ పూర్తి వ్యతిరేకం అని తేల్చి చెప్పారు.