చైనాలోని పాక్ విద్యార్థులకు బాసటగా భారత్ 

కరోనా విజృంభిస్తోన్న తరుణంలో చైనా వూహాన్‌ లో చిక్కుకుపోయిన పాకిస్థాన్ విద్యార్థులను ఆదుకోవడానికి భారత్ ముందుకు వచ్చింది. అక్కడి నుంచి పాకిస్థాన్ జాతీయులను ఇస్లామాబాద్‌కు తరలించేందుకు సిద్ధమని ప్రకటించింది. 

పొరుగుదేశం ప్రథమం విధానం మేరకు పాకిస్థాన్‌కు సహకరించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. వూహాన్‌‌లోని భారతీయులతో పాటు పొరుగుదేశాలకు చెందిన అందరినీ తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. 

వాస్తవానికి చైనా నుంచి భారత్ ఇటీవలే తమ పౌరులను రెండు ప్రత్యేక విమానాలతో వెనక్కు తీసుకువచ్చింది. ఇండోనేషియా, సూడాన్ దేశాలు కూడా తమ జాతీయులను వెనక్కు పిలుచుకున్నాయి. 

అయితే పాకిస్థాన్ మాత్రం అశక్తత వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోగలిగే శక్తి తమకు లేదని పాక్ విద్యార్ధులంతా వూహాన్‌లోనే ఉండిపోవాలని సూచించింది. ఇమ్రాన్ సర్కారు నిర్ణయంతో పాక్ విద్యార్ధులు షాక్‌కు గురయ్యారు. 

ఇమ్రాన్ సర్కారు అసమర్థతపై దుమ్మెత్తిపోశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్థాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో కష్టాల్లో ఉన్న పాక్ విద్యార్ధులను రక్షించేందుకు భారత్ ముందుకు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.