జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రైలు ప్రారంభం 

జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌ (కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.  మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. 

2017 నవంబర్‌ 29న హైదరాబాద్‌ మహానగరంలో తొలిసారి మెట్రో సేవలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. తర్వాత దశల వారీగా అమీర్‌పేట- ఎల్బీనగర్‌, అమీర్‌పేట-హైటెక్‌ సిటీ, హైటెక్‌ సిటీ-రాయదుర్గం మార్గాల్లో మూడుసార్లు మెట్రో సేవలను నాటి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 

తొలి దశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన 72.కి.మీ. మార్గంలో 69 కి.మీ. మేర మెట్రో సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్‌గా రికార్డు సృష్టించింది.   

ఎంజీబీఎస్ స్టేషన్ నిర్మాణం పలు ప్రత్యేకతలతో నిర్మించారు.  58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్‌తో స్టేషన్‌ను నిర్మించారు. 

ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణించగా, కారిడార్2 జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో సాగించే రైలు పైఅంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. 

ఐతే ఒక మార్గం నుంచి మరో మార్గం మారడానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్, కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవెల్‌లో నిర్మించారు.