కియా ప్లాంట్ తరలిపోతుందటూ కలకలం!

ముఖ్యమంత్రి వై ఎస్  జగన్మోహన్‌రెడ్డి ధోరణి కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, రాష్ట్ర అభివృద్ధి స్తంభించి పోతున్నదని ఆందోళనలు చెలరేగుతున్న సమయంలో గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో నెలకొన్న ఏకైక భారీ పరిశ్రమ అయిన అనంతపూర్ జిల్లాలోని 1.1 మిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పర్చిన కీయా కార్ల తయారీ ప్లాంట్ సహితం తమిళనాడుకు తరలి పోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై అంతర్జాతీయ మీడియాలో వచ్చిన ఒక కధనం కలకలం రేపుతున్నది. 

దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచంలోనే ఐదవ పెద్ద కార్ల  తయారీ సంస్థ అయినా కియా యాజమాన్యం ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు రాయటర్ వార్తాసంస్థ వెల్లడిం చేసింది. గత డిసెంబర్ లోనే ఈ ఫ్యాక్టరీ రెండేళ్ల నిర్మాణం అనంతరం ఉత్పత్తి ప్రారంభించడం గమనార్హం. 

రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో పారిశ్రామిక రాయితీలపై... ప్రభుత్వం పునరాలోచన చేయటమే తరలింపునకు కారణమంటూ కథనంలో పేర్కొన్నారు. కియా పరిశ్రమకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరకు ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు కియా మొగ్గు చూపింది. 

సాలీనా మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యం గల ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 15 వేల మందికి.. పరోక్షంగా మరో 40 వేల మందికి లబ్ధి చేకూర్చనుంది. కియా పరిశ్రమకిచ్చిన రాయితీలపై ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పైగా స్థానికంగా అధికార పక్షానికి చెందిన వారి నుండి ఎదురవుతున్న బెదిరింపులపై గతంలోనే కియా యాజమాన్యం ఫిర్యాదు చేయడం గమనార్హం. 

మరో వంక,  పరిశ్రమల్లో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కారణమని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. కియా పరిశ్రమ ఏర్పాటుతో పెనుగొండ పరిసరాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కియాను తరలిస్తే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రారని జాతీయ పత్రికలు పేర్కొంటున్నాయి.

అయితే తరలింపు ప్రయత్నాలు జరగట్లేదని కియా యాజమాన్యం చెబుతోంది. ప్రాధమిక దశలో ఉన్న తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులపై మౌనం వహిస్తూ, ఏపీలోని ప్లాంట్ పూర్తి సామర్ధ్యం ఉపయోగించుకోవాలని కొంటున్నామని చెప్పింది. 

కాగా.. కియా మోటార్స్‌పై రాయిటర్స్‌ కథనం పూర్తిగా అవాస్తవమని... అసత్యాలతో కూడిన కథనమని.. పరిశ్రమలు –వాణిజ్యం – పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని చెబుతూ ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రజత్‌ భార్గవ వెల్లడించారు.