ప్రత్యేక హోదా అంటే జగన్ కు బాబు గతే!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంటే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి  జీవీఎల్‌ నరసింహారావు చెచ్చరించారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో శిలాశాసనమేమీ కాదని అంటూ హోదా కావాలంటూ మళ్లీ రాజకీయాలు చేయాలనుకుంటే చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిన గతే జగన్‌కూ పడుతుందని స్పష్టం చేశారు. 

హోదా కోసం ప్రధానికి జగన్‌ లేఖ రాయడాన్ని ప్రస్తావించగా.. హోదా అంశం ముగిసిన అధ్యాయమని గతంలోనే కేంద్రం అనేక సార్లు స్పష్టం చేసిందని.. నిన్నగాక మొన్న కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. దానిని పునరుద్ధరించే ఉద్దేశం గానీ, ఆలోచన గానీ కేంద్రానికి లేదని తేల్చిచెప్పారు. ఇది జగన్‌కు కూడా తెలుసని.. తెలిసీ రాజకీయం చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. 

‘ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం. ఆ మేరకు నిధులు సమకూర్చడం జరుగుతోంది. ప్రత్యేక హోదాకు బదులు, అనేక పథకాలు, ప్రాజెక్టుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.22 వేల కోట్ల నిధులు ఇచ్చింది. హోదా ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదు’ అని తేల్చిచెప్పారు. 

కాగా.. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం తన పరిధిలోని అంశమైన కొత్త రాజధాని నిర్ణయాన్ని జీవో రూపంలో ఇస్తే.. కేంద్రప్రభుత్వం దానిని కూడా నోటిఫై చేస్తుందని చెప్పారు. అయితే రాజధాని అమరావతిని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ రాజకీయ తీర్మానం చేసిందని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం రాజధానిపై నిర్ణయాన్ని మార్చుకుని ఆ సమాచారాన్ని కేంద్రానికి పంపితే గుర్తిస్తుంది. రాష్ట్రప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని కేంద్రం ఒప్పుకొంటుందని నిన్న స్పష్టంగా చెప్పినా కూడా.. మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ జీవో ఇచ్చింది. జీవో అంటే అక్బర్‌ శిలాశాసనం కాదని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు శిలాఫలకం చెక్కారు.. దానిపై కొత్త జీవో జారీచేసే అధికారం ఎవరికీ లేదనుకుంటే అది కూడా భ్రమలో భాగమే. జీవో నిబంధనలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం మార్చితే దానిని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని తేల్చి చెప్పారు.