పొత్తులపై దిక్కుతోచని కోదండరామ్ !

జేఎసి చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో నాటి సారధి కె చంద్రశేఖరరావు అడుగులకు మడుగులోత్తుతూ, వరుసగా ఒకొక్క పార్టీని అందులో నుండి బైటకు వెళ్ళేటట్లు చేసి, దానిని టీఆర్‌ఎస్ జేబు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర వహించిన ఏం కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి ఇప్పుడు పొత్తుల కోసం దిక్కులు చూస్తున్నది. మొదట్లో ఎవ్వరితో పొత్తు లేదని, అన్నిట సీట్లకు పోటీ చేస్తామని ప్రకటనలు జరీ చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు 15 నుండి 25 సీట్లు ఇస్తే చాలు పొత్తుకు సిద్దం అంటూ తిరుగుతున్నారు.

మొదట్లో కాంగ్రెస్, టిడిపి, సిపిఐలు కలసి ఏర్పాటు చేస్తున్న `మహాకుటమి’ వైపు మొగ్గు చూపారు. పొత్తు ఖరారు అయిన్నట్లు వ్యవహరించారు. పైగా ఉమ్మడి ప్రణాళిక ఏర్పాటుకు తన అద్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలనీ, అధికారంలోకి వస్తే ఈ కమిటీకి అధికార హోదా కల్పించి, ప్రణాళిక అమలు బాధ్యత కుడా కట్టబెట్టాలి అంటూ బేరాలు ఆడారు. పరోక్షంగా ముఖ్యమంత్రి హోదా చేలాయించాలని చూసారు.

అయితే ప్రజా సంఘాల మద్దతుతో కొన్ని ఉద్యమాలు చేయడం మినహా సొంతగా ఒక్క ఉద్యమం కుడా చేయగల సత్తా, జనాన్ని సమీకరించగల యంత్రాంగం ఆయనకు లేదని తెలుసుకున్న కాంగ్రెస్ మూడు సీట్లకు మించి ఇవ్వడానికి సిద్దపడటం లేదు. మరిన్ని బేరాలు చేస్తే ఇదు వరకు ఇవ్వవచ్చు. పోటీచేస్తే వాటిల్లో ఒక్క సీట్ అయినా గెలుస్తామా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సొంత గ్రామంలోనే ఆయనేవ్వరో తెలియని పరిస్థితులు నెలకొనడంతో స్వయంగా ఆయన సొంతగా గెలిచే పరిస్థితులే కనబడటం లేదు.

సిపిఎం నాయకత్వంలో ఏర్పడిన దళిత్ బహుజన కూటమి పొత్తుకు ఆహ్వానించినా దానితో ప్రయోజనం ఉండబోదని, ఇప్పుడు తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతున్న బిజెపి వైపు ఆయన దృష్టి పడింది. బిజెపితో పొత్తుకోసం రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తున్నది.

30 సీట్లు కావాలని తెలంగాణ జన సమితి తరఫున మహా కూటమికి ప్రతిపాదనలు ఇవ్వగా, మహా కూటమి అన్ని సీట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. చర్చల్లో కనీసం 20 సీట్లు ఇవ్వకపోతారా అని భావించిన తెలంగాణ జన సమితికి దిగ్భ్రమ కలిగించే సంఖ్యను కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో తెలంగాణ జన సమితి ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో కోదండరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

119 స్థానాలకూ పోటీ చేయాలని చెప్పుకొచ్చిన తెలంగాణ జన సమితికి ఇప్పుడు అంతమంది అభ్యర్ధులు కుడా లేని పరిస్థితి నెలకొన్నది. పైగా ఎన్నికల ప్రచారం జరపగల యంత్రాంగం కుడా లేదు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ ఉనికి కుడా ఎక్కడ లేదు. బిజెపితో పొట్టు అవకాశాలను పరిశీలించడం కోసం మాజీ కేంద్ర మంతిర్ బండారు దత్తాత్రేయ, ఇతర నేతలతో కోదండరామ్ సమావేశమైన్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సీట్లు ఇస్తే మహా కూటమితో వెళ్లాలని, లేకుంటే బీజేపీతో కలిసి వెళ్లే అంశాన్ని జనసమితి నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది.  కానీ కాంగ్రెస్ చాలా స్పష్టంగా మూడు స్థానాలకు మించి ఇవ్వలేమని తేల్చి చెప్పినట్టు తెలిసింది.