ఓటుకు నోటు కేసు తెరపైకి రావడంతో చంద్రబాబు, లోకేష్ కలవరం

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రెండు రోజుల పాటు జరిపిన సోడాలలో ప్రధానంగా ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రూ 50 లక్షల న‌గ‌దుకు సంబంధించిన వ్య‌వ‌హారంపై దర్యాప్తు జరిగిన్నట్లు వెలుగులోకి రావడంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు నారా లోకేష్ కలవరానికి గురవుతున్నట్లు తెలుస్తున్నది. నాలుగేళ్ళుగా ఈ కేసు విషయంలో కదలిక లేకుండా మౌనంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా ఆసక్తి చూపడం రాజకీయ వర్గాలలో సంచలనం కలిగిస్తున్నది.

ఈ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసు ఉన్న‌తాధికారులు కేంద్రానికి లేఖ వ్రాయడంతోనే వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఐటి అధికారులు రేవంత్ రెడ్డిని లక్ష్యంగా దర్యాప్తు చేపట్టారని తెలుస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం, ఆ పార్టీలో దాదాపు అందరు నాయకులతో ఏదోవిధంగా దారికి తెచ్చుకోవచ్చనే ధీమాతో ఉన్న కెసిఆర్ కు గతంలో టిడిపిలో క్రియాశీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి కొరకరాని కొయ్యగా తయరయ్యారు. అందుకనే ఆయనను పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీయమిస్తున్నరనే కధనాలు రాగానే ఆయనపై జూబ్లి హిల్స్ లో భూ ఆక్రమణలకు సంబంధించి విచారణకు పోలీస్ లు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు పెద్దగా ప్రభావం చూపక పోవడంతో ఇప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న రోజున ఇటి దాడులు ఎదురయ్యాయి.

దాడులు ప్రారంభం కాగానే వీటితో తమకేమి సంబంధం లేదంటూ టీఆర్ఎస్ ప్రకటనలు గుప్పించినా గురువారం సాయంత్రానికల్లా రూ 1,000 కోట్ల మేరకు అక్రమ ఆస్తుల గుట్టు రట్టు అయిన్నట్లు  అన్ని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాలకు 70 పేజీల స్పైరల్ బైండింగ్ బుక్ వచ్చిపడింది. శుక్రవారం అన్ని పత్రికలూ ఈ కధనాలను ప్రముఖంగా ప్రచురించాయి.

అయితే గురువారం ఉదయం నుండి శనివారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు సోదాలు కొనసాగినా, రేవంత్‌ను దాదాపు 31 గంటల పాటు ఐటీ అధికారులు విచారించినా,  150 ప్రశ్నలకు రేవంత్‌ నుంచి లిఖితపూర్వక సమాధానాలు రాయించుకున్నా వేయి కోట్ల సమాచారం ఎక్కడా తేలలేదని తెలుస్తున్నది. స్వయంగా ఫిర్యాదు చేసిన న్యాయవాది ఇటి దాడులు కొండను తవ్వి ఎలుకను తీసున్నట్లు ఉన్నాయని నిర్వేదం వ్యక్తం చేయడం గమనార్హం.

సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, ప్రింటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.  అక్టోబర్‌ 3న విచారణకు రావాలని రేవంత్‌కు నోటీసులు జారీ చేశారు. అది వేరే అంశం.

ఇటి అధికారులు రేవంత్ బామ్మర్ది జయప్రకాశ్‌రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన రూ 20 కోట్ల లెక్క చూపని ఆదాయం మాత్రమె కనుగొన్నట్లు చెబుతున్నారు. కోర్ట్ వివాదాల దృష్ట్యా ఈ కంపెనీ 2011 తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం లేదు. దీనికి సంబంధించిన 30 శాతం  జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రేవంత్‌ భార్య గీత బ్యాంక్‌ లాకర్‌ను తెరిపించిన అధికారులు 560 గ్రాముల బంగారాన్ని, కొన్ని ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మామ పద్మారెడ్డి ఇంట్లోనూ 10 లక్షల నగదు లభ్యమైంది.

ప్రధానంగా ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్‌కు ఇచ్చిన రూ 50 లక్షల గురించి ఐటీ అధికారులు రేవంత్‌ను ఆరా తీసిన్నట్లు చెబుతున్నారు. గత నాలుగేళ్ళుగా తెలంగాణ ఎసిబి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోలేక పోయింది. అది కనుక్కొంటే గాని కేసు నిలబడే అవకాశం లేదు. ఆ కేసులో రేవంత్‌రెడ్డితోపాటు నిందితులయిన ఉదయ్‌సింహ, సెబాస్టియన్‌లను కూడా విచారించారు.

ఓటుకు నోటు కేసులో కీల‌క పాత్ర‌దారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబునాయుడు అమెరికా ప‌ర్య‌ట‌న త‌ర్వాత హైద‌రాబాద్ లో ఆగ‌కుండా వెంట‌నే అమ‌రావ‌తి వెళ్ళిపోవడం గమనార్హం. ఈ కేసులో కేవలం చంద్రబాబు, లోకేష్ ప్రతినిధిగా మాత్రమె రేవంత్ వ్యవహరించి ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మరలుతున్నది.

ఈ సంవత్సరం ప్రారంభంలో టిడిపితో పొత్తుకు సై అనే సంకేతాలు ఇచ్చిన కెసిఆర్ ఆ తర్వాత ఆ వైపు దృష్టి సారించలేదు. ఈ లోగా కాంగ్రెస్ తో ఆ పార్టీ పొత్తుకు సిద్దపదడంతో కెసిఆర్ రగలి పోతున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఇప్పటివరకు పట్టించుకోననే ఈ కేసును తెరపైకి తెచ్చిన్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ కేసును దర్యప్తు చేయగల సామర్ధ్యం తెలంగాణ పోలీస్ లకు లేదని స్పష్టం కావడంతో కేంద్ర సంస్థల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.