కేరళలో కరోనా వైరస్‌ మూడో కేసు

భారత్‌లో కరోనా వైరస్‌ మూడో కేసు నమోదైంది. కేరళలోని కాసర్‌గఢ్‌లో ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్‌ సోకిన బాధితుడు.. ఇటీవల వూహాన్‌ నుంచి కేరళకు చేరుకున్నాడు. అయితే బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కే కే శైలజ ప్రకటించారు.

తొలి రెండు కేసులు కూడా కేరళలోనే నమోదు అయ్యాయి. మొదటి ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఇక కరోనా వైరస్‌ బారిన పడి చైనాలో 361 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ వ్యాప్తి వల్ల 9,618 మంది ఆస్పత్రిలో చేరారు. 478 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ వైరస్‌ భారత్‌, అమెరికా, యూకేతో పాటు మొత్తం 25 దేశాలకు విస్తరించింది.

కరోనాను కట్టడి చేసేందుకు చైనా పటిష్ఠమైన చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ సోకిన బాధితులను ప్రత్యేక ప్రాంతాల్లో ఉంచుతూ ఇతరులతో కలువకుండా గట్టి చర్యల్ని తీసుకుంటున్నది. ఇంకోవైపు, వ్యాధి ప్రభావిత ప్రాంతాలైన వుహాన్‌, వెన్‌జౌ లాంటి నగరాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. 

నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడం కోసం ప్రతి ఇంటి నుంచి ఒక్క సభ్యున్ని మాత్రమే అధికారులు బయటకి అనుమతిస్తున్నారు. అదికూడా రెండ్రోజులకు ఒకసారి మాత్రమే. అధికారుల నిషేధాజ్ఞలతో ఆదివారం వెన్‌జౌ నగరంలోని రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. 

46 హైవే టోల్‌ స్టేషన్లను అధికారులు మూసివేశారు. మెట్రో రైలు సేవలు, ప్రజా రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటివరకూ ఈ నగరంలో 265 మందికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో తరగతుల్ని మార్చి 1 వరకు ప్రారంభించవద్దని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 17వరకు వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.