తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన

ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో  నియంతృత్వ పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగిస్తూ.... భావ ప్రకటన స్వేచ్ఛను  టీఆర్ఎస్ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు.  నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులపై ఆంక్షలు విధించడం సరికాదని హితవు చెప్పారు. 

నిర్మల్ జిల్లా బైంసాలో ఎంఐఎం అండతో ఓ వర్గానికి చెందినవారు మరొక వర్గానికి చెందిన వారిపై  జరిపిన దాడుల్లో బాధితుల ఆవేదనను.... బయట ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు సిద్దుపై.. పోలీసులు కేసులు పెట్టడం అక్రమమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు సిద్దు  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన వైఖరిని... కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 

జర్నలిస్టు సిద్దుకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ సర్కారు కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఎంఐఎం సూచనల మేరకే... అక్రమ కేసులు పెడుతున్నారని  మండిపడ్డారు. భైంసాలో దాడులకు పాల్పడిన వారిపై  చర్యలు తీసుకోకుండా... అమాయక యువకులను అరెస్టు చేశారని తెలిపారు. 

గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్... మీడియా సంస్థలపై ఆంక్షలు విధించిన తీరు దారుణమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం కూడా అదే విధానాలు అనుసరిస్తూ... జర్నలిస్టులపై నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ప్రసారం చేస్తున్న  మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదనే  విషయం గుర్తించాలని ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను కేంద్రం గౌరవిస్తోందని చెప్పారు. భైంసాలో దాడులు జరిగిన తీరును,  బాధితుల ఆవేదన ప్రసారం చేసిన జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను తెలంగాణ డీజీపీతో మాట్లాడతానని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీలు  సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.

కాగా, భైంసాలో జరిగిన దాడులపై వాస్తవాలను వెలు=గులోకి తెచ్చిన జర్నలిస్టు సిద్దుపై పోలీసులు కేసు పెట్టడం దారుణమని ఎంపీ సంజయ్విమర్సన్చారు. 40 మంది హిందువుల కుటుంబాలపై ఎంఐఎం గుండాలు  విచక్షణరహితంగా దాడులు చేశారని చెబుతూ దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల పైనా దుండగులు దాడి చేశారని పేర్కొన్నారు.

భైంసాలో జరిగిన దాడుల్లో వాస్తవాలను ప్రజలకు తెలియకుండా.. కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొంటూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ వర్గం ప్రజలను, ఎంఐఎం పార్టీని  సంతృప్తి పరచడం కోసం హిందువులపై అక్రమ కేసులు పెడుతోందని ధ్వజమెత్తారు. దాడులు చేసిన బాధ్యులను శిక్షించకుండా ఆత్మరక్షణ కోసం అడ్డుపడిన హిందూ యువకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

నిజాలు బయటపెట్టిన జర్నలిస్ట్ పై... మత ఘర్షణలు రెచ్చగొట్టారంటూ... ఎందుకు కేసు పెట్టారని నిలదీశారు. జర్నలిస్ట్ సిద్దు వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలు వాస్తవాలా... కాదా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సోషల్  మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ ప్రభుత్వం హిందూ యువకులను... భయపెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు. బైంసా బాధితుల ఆవేదనను బయట ప్రపంచానికి తెలియజేయడం ఎలా తప్పు అవుతుందని నిలదీశారు.