కేరళలో రెండో కరోనా వైరస్‌ కేసు

కేరళ రాష్ట్రంలో రెండో కరోనా వైరస్‌ కేసు నమోదైంది. మూడో రోజుల క్రితం ఇదే రాష్ట్రంలో మొదటి కరోనా వైరస్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. రోగిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, కేరళ వైద్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్‌ సోకిన సదరు రోగి గతంలో చైనాలో ప్రయాణించి వచ్చినట్లు సమాచారం. 

కరోనా వైరస్‌ విజృంభనతో చైనాలో ఇప్పటికే 310 మంది మృత్యువాతపడ్డారు. 20 దేశాలకు వైరస్‌ వ్యాప్తి చెందింది. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది.  

ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్‌ నగరం నుంచి 600 మందికి పైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలించిన సంగతి తెలిసిందే. అలాగే భారత్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. 

ఈ క్రమంలోనే చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్‌లైన్‌ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఇండియా ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బీజింగ్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది.

‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ-వీసా మీద భారత పర్యటనకు వెళ్లాలనుకే సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేశాం. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వసాయి’ అని పేర్కొంది. 

ఒకవేళ.. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ వెళ్లాలనుకునేవారు.. బీజింగ్‌లోని భారత ఎంబసీ కార్యాలయాన్ని కానీ లేదా షాంఘై, గ్వాంగ్జౌ నగరాల్లోని భారత కాన్సులేట్‌లను గానీ, భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలను గానీ సంప్రదించవచ్చునని సూచించింది