కెసిఆర్ కోడ్ ఉల్లంఘన.. కేసు నమోదుకు బిజెపి డిమాండ్

తెలంగాణలో మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, సుమోటో కింద ఎన్నికల కమిషన్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి డిమాండ్ చేసారు. శాసనసభ రద్దైన 20 రోజుల తర్వాత ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ చెప్పడం దారుణమని విమర్శించారు. గత 20 రోజుల్లో అమలు చేసిన పథకాల కొనసాగింపు పేరుతో అనేక చోట్ల టీఆర్‌ఎస్ పార్టీ ఆపద్ధర్మ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు కొడ్ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయని చెబుతూ వీటన్నింటిపైనా ఎన్నికల సంఘం సూమోటోగా విచారణ చేపట్టి, సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతు బంధు, బతుకమ్మ చీరల పంపిణీ తదితర పథకాలను బీజేపీ వ్యతిరేకించదు కానీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈ రెండు పథకాల లబ్దిదారులకు వాటిని పంపిణీ చేసే సమయంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు , ఆపద్థర్మ మంత్రులు తదితరుల ప్రమేయానికి సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేసారు. ప్రగతి నివేదన సభ విఫలమైన మరునాటి నుండి టీఆర్‌ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని చెప్పుకొచ్చారు.

ప్రచారంలో ప్రజల నుండి ఎదురవుతున్న నిరసనలు తట్టుకోలేక టీఆర్‌ఎస్ అభ్యర్ధులు ప్రజలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని బిజెపి నేత ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్ధి మాగంటి గోపినాథ్‌ను యూసుఫ్‌గూడలో యాదయ్య అనే స్థానికుడు ఈ నాలుగున్నరేళ్లలో ఏమీ అభివృద్ధి చేయకుండా ఇపుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించినందుకు తాజా మాజీ ఎమ్మెల్యే సాక్షిగా ఆయన అనుచరులు యాదయ్యను చితకబాదడమే ఈ దౌర్జన్యాలకు పరాకాష్టగా ఉందని పేర్కొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించినందుకు దాడి చేశారని యాదయ్య చెప్పడం టీఆర్‌ఎస్ నాయకుల అకృత్యాలకు నిదర్శనమని తెలిపారు. వీరికి ప్రజలే రాబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్ధి చెప్తారని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.  రేవంత్‌ రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో బీజేపీ ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసారు. అధికారులకు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే దాడులు జరిగాయని, రాజకీయ ప్రయోజనాలకు ప్రత్యర్థి పార్టీల నాయకులను వేధింపులకు గురిచేయడం, తప్పుడు కేసులు బనాయించడం కాంగ్రెస్ పార్టీ నైజమని తెలిపారు.