పాకిస్థాన్‌పై మరో దఫా మెరుపు దాడులు !

పాకిస్థాన్‌పై మరో దఫా మెరుపు దాడులకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ విషయంపై చర్చకు దారి తీశాయి.

‘‘మన పొరుగుదేశం పాకిస్థాన్‌ అశాంతిని ఎగదోస్తోంది. అత్యంత కిరాతక చర్యలకు పాల్పడుతోంది. మన బీఎ్‌సఎఫ్‌ జవాన్ల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించినదీ మీరు చూశారు. ఏం జరిగిందో చూశాం. అది మంచో చెడో మీకు తెలుసు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో మీరు చూస్తారు..’’అని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.

అటు సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్‌ జనరల్‌ కేకే శర్మ కూడా- పాక్‌పై ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు, ఏ క్షణమైనా అది జరిగే అవకాశమున్నట్లు వెల్లడించారు. ‘‘పాక్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్‌ దళాలు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. సెప్టెంబరు 18న మన జవాను నరేంద్ర సింగ్‌ను తలనరికి చంపడాన్ని మన దళాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్‌ సరిహద్దు దళం ఇంత పాశవికంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి” అని పేర్కొన్నారు.

ఆక్రమిత కశ్మీర్‌ లో - మన సరిహద్దులకు కేవలం 5-7 కిలోమీటర్ల దూరంలోనే చాలా ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, భారత్‌లోకి చొరబడ్డానికి అనేకమంది ఉగ్రవాదులు కాచుక్కూచుని ఉన్నారని కుడా పేర్కొన్నారు. మన దళాలు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నాయని కేకే శర్మ స్పష్టం చేసారు.

ఇలా ఉండగా, మరో దఫా మెరుపు దాడులకు సమయం ఆసన్నమైందని అటు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రావత్‌ కూడా కొద్ది రోజుల కిందట అన్న సంగతి తెలిసిందే. భారత్‌-పాక్‌ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఆకస్మికంగా రద్దు కావడం దౌత్యపరంగా కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు సంకేతంగా చెబుతున్నారు. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా పాల్గొన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రసంగించే సమయంలో బైటకు వచ్చేయడం సహితం ప్రాధాన్యత సంతరింప చేసుకోంది.