మురికి రాజకీయాలతో తలెత్తిన షిర్డీ వివాదం

చలసాని నరేంద్ర 

నేడు దేశంలోని ప్రముఖ్ హిందూ ప్రార్ధన స్థలంలో ఒకటిగా విశేష ప్రాచుర్యం పొందుతున్న షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయంకు సంబంధిచి ఈ మధ్య ఒక పెను వివాదం తలెత్తింది. సాయిబాబా జన్మస్థలం అంటూ అక్కడకు 272 కిమీ దూరంలో గల పత్రీ గ్రామంలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ 200 కోట్లు కేటాహించడంతో ఈ వివాదం చెలరేగింది. 

నిజంగా హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం, భక్తుల సదుపాయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకొంటే అందరం సంతోషించేవాళ్ళం. అయితే దీని వెనుక ఉన్న మురికి రాజకీయాలతో ఇది భక్తులలో తీవ్ర ఆందోళన కలిగించింది. సాయిబాబా జన్మస్థలం పత్రీ అంటూ కొందరు భక్తులు విశ్వసిస్తూ ఉంటె ఉండవచ్చు. 

అయితే అసంఖ్యాకంగా భక్తులు నిత్యం పారాయణం కావించే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన 16 ఏళ్ళ వయస్సులో షిర్డీకి వచ్చారు. అప్పటి నుండి దాదాపుగా అక్కడనే ఆయన లీలలు అన్ని జరిగాయి. కానీ అంతకు ముందుటి ఆయన జీవనం గురించి ఆయనెప్పుడూ ప్రస్తావించిన దాఖలాలు లేవు. దానితో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక మురికి రాజకీయ నెలకొన్నట్లు భక్తులు నిరసనలు వ్యక్తం చేసారు. 

షిర్డీలోని భక్తులు నిరవధిక బంద్ కు పిలుపు ఇచ్చారు. అయితే స్థానిక ఎంపీ, భాజపా నాయకుడు రాధాకృష్ణ విఖే పటేల్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ను కలవడంతో ఈ పిలుపును ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి కొంతమేరకు సానుకూలంగా స్పందించినట్లు కనబడుతున్నది. 

ప్రార్ధన స్థలాలపై భక్తులు, ఆయా మతాల పెద్దలు ప్రభావం చూపితే భక్తి, పవిత్రత నెలకొంటుంది. కానీ ఎప్పుడైతే రాజకీయ నీడలు పడటం ప్రారంభం అవుతుందో  అప్పటి నుండి ఆయా స్థలాలకు సహితం మురికి వ్యాపిస్తూ ఉంటుంది. ఇతర మతాలలో రాజకీయ నాయకులు సహితం తమ మతానికి చెందిన ప్రార్ధన స్థలాలపై ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ వాటి వ్యవహారాలలో వారి పెత్తనం దాదాపు సాగదు. 

కానీ, దురదృష్టవశాత్తు, హిందూ దేవాలయాల విషయంలో ఒక వంక ప్రభుత్వాలు, మరో వంక రాజకీయ నాయకుల పెత్తనం సాగుతూ ఉండడంతో అక్కడ పవిత్రతకు తీవ్ర భంగం కలుగుతున్నది. నేడు షిర్డీలో కూడా అదే జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సాయిబాబా సమాధి స్వీకరించిన షిర్డీ నుండి ప్రధాన దేవాలయాన్ని 272 కిమీ దూరంలో ఉన్న పత్రికి తరలించే ప్రయత్నంగా చాలామంది భావించారు. 

పత్రిలో ఇప్పటికే సాయిబాబా దేవాలయం ఉండటం ఇక్కడ గమనార్హం. అయితే ఎన్నడూ షిర్డీ వలే అది ఎప్పుడు ప్రాచుర్యం పొందలేదు. అందుకనే బాబా భక్తులు పూజలు జరిపడానికి షిర్డీకి మాత్రమే వస్తూంటారు. అయితే ఇప్పుడు మరో బాబా దేవాలయానికి ప్రాచుర్యం కలిగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనది. 

షిర్డీ కేవలం 36,000 మంది జనాభా ఉన్న చిన్న గ్రామం. సాయిబాబా దేవాలయంతో వచ్చే యాత్రికుల పర్యటనలతోనే ఈ గ్రామం ఆధారపడి ఉంది. షిర్డీ నుండి పత్రికి భక్తులను మళ్లిస్తే షిర్డీకి ఆర్ధికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది. 

షిర్డీ సాయిబాబా దేవాలయ ట్రస్ట్ దేశంలోనే సంపన్నమైన దేవాలయ ట్రస్ట్ లలో ఒకటి. దానికి 2019లో రూ 689 కోట్ల విరాళాలు సమకూరాయి. మార్చ్ 31, 2019 వరకు రూ 2,238 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. షిర్డీ గ్రామా అభివృద్ధిని షిర్డీ దేవాలయ ట్రస్ట్ పర్యవేక్షిస్తుంటుంది. అంటే అక్కడ హోటళ్లు,లాడ్జీలు, అతిధి గృహాలు, భక్తులకు ఇతర నివాస ప్రదేశాలు, వాణిజ్యపరమైన వాటన్నింటిని ట్రస్ట్ నియంత్రిస్తుంది. ఆ గ్రామంపై ఆర్ధికంగా, ఇతరత్రా ట్రస్ట్ కు ఉన్న ఆధిపత్యాన్ని ఇది వెల్లడిస్తుంది. 

షిర్డీ నెలకొన్న అహ్మదానగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత రాధాకృష్ణ విఖే పటేల్ ఈ ట్రస్ట్ పై ఆధిపత్యం వహిస్తున్నారు. విఖే పాటిల్ కాంగ్రెస్ నుండి వైదొలిగి, కొంతకాలం క్రితం భాజపాలో చేరడంతో ఈ దేవాలయంపై ట్రస్ట్ పై కాంగ్రెస్ ఆధిపత్యం పోయింది. ఈ ట్రస్ట్ నుండి పాటిల్ పట్టును తగ్గించే పరిస్థితిలో కాంగ్రెస్ ఇప్పుడు లేదు. 

దానితో, షిర్డీపై కోల్పోయిన ఆధిపత్యాన్ని భర్తీ చేసుకోవడం కోసం ఎన్సీపీతో కలసి పత్రి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది. దానితో సహజంగానే షిర్డీ కి వచ్చే విరాళాలు పత్రికి మారే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ మురికి రాజకీయాలలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చిక్కుకు పోయిన్నట్లు కనిపిస్తున్నది. 

పత్రి దేవాలయం ట్రస్ట్ ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల ఆధీనంలో ఉండటం గమనార్హం. అందుకనే ఆ రెండు పార్టీలు కలసి పత్రి అభివృధ్ధికోసం ఎత్తుగడ వేసాయి. దానితో వారి ఉద్దేశ్యాలు స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి. కేవలం తమ ఆధిపత్యం కోసమే ఈ వివాదాన్ని వారు సృస్టించిన్నట్లు అర్ధం అవుతుంది. షిర్డీ సాయిబాబా దేవాలయం నిర్వహిస్తున్న అయితే శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ (షిర్డీ) చట్టం, 2004 ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 

ఇప్పుడు ఇక్కడ తలెత్తుతున్న మౌలిక ప్రశ్న దేవాలయాల ట్రస్ట్ లు ప్రభుత్వ ఆధీనంలో ఉండవచ్చా అన్నది. కేరళలోని శబరిమల దేవాలయ వివాదంలో సహితం ఇటువంటి ప్రశ్న తలెత్తింది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్వహణలో సహితం ఇటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అయితే ఏడు కొండల తిరుమల నాధుడి పరిధి నుండి నాలుగైదు కొండలను తీసివేసే ప్రయత్నం చేశారు కూడా. 

గతంలో దేవాలయాలు ప్రభుత్వాల అధీనంలో ఉన్నా రాజకీయ నాయకులకు పాలక మండలిలో పెద్ద పీఠ వేసేవారు కాదు. కొందరిని పాలక మండలిలో నియమించినా వారు భక్తుల వలే వ్యవహరించేవారు కానీ, అక్కడ మురికి రాజకీయాలు తీసుకు వచ్చేవారు. తిరుమలలో కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రి పదవి పొందలేక పోయిన టి సుబ్బరామిరెడ్డి ని టిటిడి బోర్డు చైర్మన్ గా నియమించినప్పటి నుండి రాజకీయ నాయకులు నేరుగా అక్కడ తిష్ట వేయడం ప్రారంభించారు. 

గతంలో టిటిడి బోర్డు చైర్మన్ లు కేవలం బోర్డు సమావేశాలకు మాత్రమే హాజరవుతూ ఉండేవారు. అయితే ఎమ్యెల్యే కాలేక పోయిన బి కరుణాకరరెడ్డి తిరుపతి వాసుడు కావడం, అక్కడనే ఉండడంతో చైర్మన్ నిత్యం పాలనాయంత్రాంగాల్లో భాగం అవుతూ వచ్చారు. అదే రీతిలో డీకే ఆదికేశవులు నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి, సుధాకర్ యాదవ్ ల నుండి నేటి వైవి సుబ్బారెడ్డి వరకు రాజకీయ నాయకులకు తిరుమలలో పునరావాసం కల్పించారు. వీరందరూ ఇతరత్రా రాజకీయ పదవులు పొందలేక, పునరావాసంగా ఈ పదవులు పొందడం గమనార్హం. 

హిందూ దేవాలయాల పాలక మండలిలను రాజకీయ నాయకులతో నింపడమే కాకుండా దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఖర్చు పెడుతూ ఉండటం, అన్య మతస్థులను కీలక పదవులలో నియమించడంతో పాటు ఇతర మతాల ప్రచారాలకు సహితం ఈ దేవాలయాలను వాడుతూ ఉండడం వివాదాస్పదంగా మారుతున్నది. 

అన్య మతాలకు చెందిన ఉద్యోగాలను తొలగించాలని కోర్ట్ ఉత్తరువులు, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. ఇవ్వన్నీ మురికి రాజకీయాల కారణంగానే జరుగుతూ ఉండటం గమనార్హం. అందుకనే హిందూ దేవాలయంను ప్రభుత్వ కబంధ హస్తాల నుండి, మురికి రాజకీయాల నుండి విముక్తి కావించాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల యాజమాన్యం పైననే రాజకీయ నాయకులు పట్టు కోసం ప్రయత్నిస్తుండటం గమనార్హం. కుటుంభం పరంగా ఏర్పాటు చేసే దేవాలయాల యాజమాన్యంలో పాల్గొన్నా, ప్రభుత్వ పరంగా జరిగే పాలక మండలిల నియామకాలలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చూడవలసి ఉంది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా వీటిని మార్చకుండా జాగురకత వహించవలసి ఉంది. అందుకోసం దేవాలయాల నిర్వహణ పట్ల స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసి ఉంది. 

ఎన్నికలలో సీట్లు ఇవ్వలేక పోతే, పోటీ చేసినా గెలుపొందలేక పోతే, గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేక పోతే దేవాలయ పాలకమండలిలలో పదవులు కట్టబెట్టే మురికి సంస్కృతికి చరమగీతం పడవలసి ఉంది. అసలు ఎండోమెంట్ శాఖనే రద్దు చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయా సంప్రదాయాలకు చెందిన ఋషులు, సాధు సంతతులకు దేవాలయాల నిర్వహణలో క్రియాశీల పాత్ర కల్పించాలి. 

(ఆంధ్రభూమి నుండి)