కేటీఆర్‌‌ను సీఎం చేస్తే సర్కార్‌ కూలుతుందా!

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే, మంత్రులెవరూ సహకరించరని, ప్రభుత్వం కూలుతుందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. అందుకే సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, తాను ఇంకా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారని ఎద్దేవా చేశారు. 

ఎంత సేపు కొడుకు సీఎం, తండ్రి పీఎం అన్న తపనే తప్పా, రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్‌కు ఏ మాత్రం ఆలోచన లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి, మతం కోణంతో విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదని సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ కట్టుబడి ఉందని చెబుతూ అమలు చేయని పథకాలను, అమలులో ఉన్నట్లు కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఏఏకు వ్యతిరేకమని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సీఏఏ విషయంలో దేశంలో ఏదో జరుగుతోందని చిత్రీకరిస్తున్న కేసీఆర్.. రాష్ట్రంలో ఏదో జరగాలనే మూర్ఖపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. 

విపక్షాలు, సీఎం కేసీఆర్ ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్నారని దయ్యబట్టారు. సీఏఏపై బాధపడుతోంది ముస్లింలు కాదని, ఆ బాధంత విపక్షాలదేనని ఎద్దేవా చేశారు. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లతో అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రవాదులకు పౌరసత్వాన్ని టీఆర్ఎస్ ఇవ్వాలనుకుంటుందా అని ప్రశ్నించారు. 

బైంసా ఘటనను గల్లీ లొల్లిగా అభివర్ణించిన కేసీఆర్‌కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా రాష్ట్ర సర్కార్‌కు రాలేదని మండిపడ్డారు. 

కాగా, కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు బీజేపీ అంటేనే భయపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. అందువల్లే మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల కోసం మోడీ సర్కార్ తీసుకువచ్చిన అనేక పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.