చైనా నుంచి ఢిల్లీ చేరిన ఎయిర్ ఇండియా విమానం

చైనాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో అక్కడ ఉన్న భారతీయులు తిరిగి ఇండియా వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. దాంతో వారందరిని తీసుకొనిరావడానికి శుక్రవారం చెైనాకు వెళ్లిన ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరింది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతండటంతో.. వుహాన్‌లోని భారతీయులు తమ స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

కానీ, అక్కడి ప్రభుత్వం విమానాలను రద్దు చేయడంతో.. భారత ప్రభుత్వం అక్కడి అధికారులతో మాట్లాడి ప్రత్యేక సదుపాయాలతో కూడిన ఎయిర్ ఇండియా విమానాన్ని చైనాకు పంపించింది. ఆ విమానంలో ఎయిర్ ఇండియా పారామెడిక్ సిబ్బందితో పాటు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు చెందిన అయిదురు సీనియర్ వైద్యులను చైనాకు పంపింది. ఆ విమానం శనివారం ఉదయం 7:26 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయింది.

వూహాన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు చైనా ప్రభుత్వానికి భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ‘కరోనా వైరస్‌ ప్రభావంతో.. 324 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం ఫిబ్రవరి 1 తెల్లవారుజామున వుహాన్ నుండి బయలుదేరింది. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ విమాన ప్రయాణానికి వీలు కల్పించినందుకు చైనా ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

వుహాన్ నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులతో పాటు సిబ్బందిని కూడా ఢిల్లీ సమీపంలోని మనేసర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. అక్కడ విమానంలో వచ్చిన వారందరికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానంలో 324 మంది భారతీయుల్ని వుహాన్ నుంచి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. వారిలో ఎక్కువమంది విద్యార్థులున్నట్లు వారు తెలిపారు.

చైనా నుంచి విమానంలో వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి.. 14 రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ తర్వాత కూడా వారి శరీరంలో ఎటువంటి వైరస్ లేదని తేలితే వారిని ఇంటికి పంపిస్తారు. విమానాశ్రయంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి అనుమానం ఉన్న వ్యక్తులను బేస్ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించనున్నారు. 

విమానంలో వచ్చిన ప్రయాణికులను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లో జ్వరం, దగ్గు. శ్వాసకోశ ఇబ్బందులున్న ప్రయాణికులుంటారు. వీరిని నేరుగా బీహెచ్‌డీసీకి పంపిస్తారు. రెండవ గ్రూప్‌లో వైరస్‌కు సంబంధించిన ఎటువంటి లక్షణాలు లేని మరియు చేపల మార్కెట్ లేదా జంతువుల మార్కెట్లకు వెళ్లిన వారు ఉంటారు. 

ఎందుకంటే వుహాన్‌లోని ఒక సీఫుడ్ మార్కెట్లో వైరస్ వ్యాప్తి చెందిదనే వార్తలతో వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా గత 14 రోజుల్లో వైరస్ లక్షణాలు కలిగిన చైనీస్ వ్యక్తిని కలిసిన వారిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం స్పెషల్ వార్డుకు తరలిస్తారు. మూడవ గ్రూప్‌లో గత వారం రోజులలో ఎటువంటి లక్షణాలు కనిపించని వ్యక్తులు మరియు వైరస్ లక్షణాలు కలిగిన చైనీస్ వ్యక్తితో సంబంధం లేని వ్యక్తులు ఉంటారు.