బిజెపిని ఎదుర్కోవడానికి `రామ్ భక్త’గా మారిన రాహుల్

ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుపై ప్రజల తీర్పు కోరడం ద్వారా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించే సాహసం కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ చేయడం లేదు. `హిందుత్వ పార్టీ’గా పేరొందిన బిజెపిని ఎదుర్కోవడం కోసం `ఉదార హిందుత్వ’ను అనుసరిస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్థిరమైన విధానం అంటూ ఈ విషయంలో లేకపోవడంతో ఒకొక్క రాస్త్రంలో ఒకొక్క విధంగా వ్యవహరిస్తూ ఆశించిన ఫలితం పొందలేక పోతున్నారు.

గుజరాత్ లో దేవాలయాలు సందర్శించడం ద్వారా, తనను తను శివ భక్తుడినని చెప్పుకోవడం ద్వారా హిందువులు వోట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసారు. కర్ణాటకలో సహితం పలు దేవాలయాలతో పాటు మఠాలు, పీఠాదిపతులను, స్వామీజీలను సందర్శించడం ద్వారా తనను తాను ఒక హిందువుగా చాటుకొనే ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నాలు చెప్పుకోదగిన ఫలితాలు సాధించలేక్ అపోవడంతో త్వరలో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో సరికొత్త అవతారాలు ఎత్తుతున్నారు.

గతవారం రాహుల్ ను `శివభక్తు’డిగా పేర్కొంటూ పోస్టర్లు, బ్యానర్లు వేసారు. అయితే తాజాగా `రామ్ భక్త పండిట్’ గా ప్రచారం చేస్తూ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. సాత్నా జిల్లాలోని చిత్రకూట్ లో గల ప్రముఖమైన కామత్ నాథ్ దేవాలయంలోని రామ్ దర్భార్ లో పూజలు జరిపి వింధ్య ప్రాంతంలో జరిగే ఎన్నికల ప్రచారానికి పార్టీ పతాకం ఊపి ప్రారంభించారు. రాహుల్ ను `రామ్ భక్త పండిట్ రాహుల్ గాంధీ’ అంటూ పోస్టర్లతో ఆయనకు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

మొత్తం 30 సీట్లు గల వింధ్య ప్రాంతం కాంగ్రెస్ కు బలమైనది. గత ఎన్నికలలో కాంగ్రెస్ 12 సీట్లు గెల్చుకోగా బిజెపి 16, బిఎస్పి 2 సీట్లను గెల్చుకొన్నాయి. ఈ ప్రాంతంలోని సత్నా, రేవా జిల్లలో రెండు రోజుల పర్యటనను ఈ నగరం నుండే ప్రారంభించారు. శ్రీరాముడు ఇక్కడి నుండే వనవాసం ప్రారంభించారని చెబుతూ ఉంటారు. నెరవేర్చని బిజెపి హామీలను ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.