హోమియోతో కరోనా చికిత్స

చైనాలో 130 మందికి పైగా బలిగొని, ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ (ఎన్‌సీఓవీ) నివారణకు మన హోమియోపతి విధానంలో ఔషధం ఉందని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి హోమియోపతి, యునానీ ఔషధాలు పనిచేయగలవని ఆయుష్‌ శాఖ  ఒక ప్రకటనలో తెలిపింది. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని హోమియోపతి కేంద్ర పరిశోధన మండలి శాస్త్ర సలహా బోర్డు సమావేశంలో   హోమియోపతి ద్వారా కరోనా వైరస్‌ను అడ్డుకోవడంపై చర్చించినట్టు ప్రభుత్వం తెలిపింది. 

రోగ నివారణ చర్యగా హోమియోపతి ఔషధం ఆర్సెనికం (Arsenicum album 30) ని ఉదయం ఖాళీ కడుపుతో మూడురోజుల పాటు తీసుకోవాలని సూచించింది. తమ పరిసరాల్లో ఆ వ్యాధి ఇంకా ఉన్నట్లయితే నెల తరువాత మళ్లీ అదే ఔషధాన్ని తీసుకోవాలని పేర్కొంది. ఇన్‌ఫ్లూయెంజా (ఊర్ధశ్వాస నాళ ప్రాంతంలో వైరస్‌ వలన కలిగే విషపడిశము) నివారణకు కూడా ఇదే ఔషధాన్ని ఉపయోగిస్తారని తెలిపింది. 

అయితే ఇది వ్యాధి నివారణకు కేవలం తాము చేస్తున్న సూచన మాత్రమేనని, చికిత్స విధానం కాదని స్పష్టం చేసింది. దీంతోపాటు వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఆయుష్‌ శాఖ సూచించింది. సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని, కడుగని చేతులతో కండ్లు, ముక్కు, నోరు ముట్టుకోవద్దని, అనారోగ్యం బారిన పడిన వారికి కొంత దూరంగా ఉండాలని తెలిపింది. 

ప్రయాణం సమయంలో, ఇతరులతో కలిసి పనిచేసే సమయంలో ఎన్‌95 మాస్క్‌ ధరించడం మంచిదని సూచించింది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకొనేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానాలను, భోజనం అలవాట్లను అలవరచుకోవాలని తెలిపింది. మరోవైపు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను తమ పరిశోధనశాలలో అభివృద్ధి చేసినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆ వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేయగలమని తెలిపారు.