ఎప్పుడు అసంతృప్తి, అభద్రతా భావంలో కేసీఆర్ 

సీఎం కుర్చీ పోతుందని  కేసీఆర్ కు  ఎప్పుడు అసంతృప్తి, అభద్రతా భావమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తాను చేసే తప్పులు బయటపడుతాయని భయం కేసీఆర్ కు ఉందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చాడో తమకు తెలుసని ఎద్దేవా చేశారు. 

“ఆయన గెలిస్తేనే ప్రజలు ఇచ్చిన తీర్పట..మేము గెలిస్తే అదిగెలుపు కాదంట.. మున్సిపల్ ఎన్నికల్లో  80 లక్షల ఖర్చు చేసినం అని సీఎం చెప్పిండు..ఇంత కన్నా అబద్దం ఇంకోటి ఉంటుందా?” అని ఆయన మండిపడ్డారు.  అక్రమాలు ,అవినీతి చేయడం, వాటిని కప్పిపుచ్చుకునేందుకు వేదాలు వల్లించడం… సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు అలవాటని విమర్శించారు. 

ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ గెలించిందని చెబుతూ జేపీ గెలిస్తే సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని ధ్వజమెత్తారు.  మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అడ్డదారులు తొక్కలో అన్నీ చేశాడని, ఎన్నికల సంఘాన్ని  కూడా సీఎం వాడుకున్నాడని ఆరోపించారు. 

తాము అన్ని రకాలుగా  టీఆర్ఎస్  తో పోరాటం చేశామని చెబుతూ  “ఆ పార్టీ మద్యం తో పోరాటం చేసినం, డబ్బుతో పోరాటం చేసినం,  టీఆర్ఎస్ పోలీస్ తో పోరాటం చేసినం”  అని పేర్కొన్నారు.  

“ఆంధ్ర ఎంపీ ని తీసుకొచ్చి ఓటు వేయించారు..ఆంధ్ర రాజ్యసభ సభ్యుడిని తీసుకొచ్చి ఎలా ఓటు వేపిస్తారు? మరి మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం.. మేము కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి  మా ఎంపీ లను తీసుకొచ్చి ఓటు వేస్తే…మీకు మున్సిపాలిటీ లు దక్కుతాయా? అంటూ ప్రశ్నించారు. 

నిజామాబాద్‌లో మూడో స్థానంలో ఉన్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంలో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. తుక్కుగూడలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీతో ఎలా ఓటు వేయిస్తారు?' అని ప్రశ్నించారు. తుక్కుగూడ ఛైర్మన్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

మంత్రి సబితారెడ్డి చర్యలతో ఇంద్రారెడ్డి ఆత్మ గోషిస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని మా ఎంపీలందరితో ఓటు వేయిస్తే.. టీఆర్ఎస్‌కు ఒక్క మున్సిపాలిటీ దక్కదు. నిజామాబాద్ ప్రజలు పార్లమెంట్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను తిరస్కరించారు. బైంసాలో ఒక్క వార్డు కూడా గెలవని టీఆర్ఎస్.. బీజేపీని విమర్శించడమా?’ అని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.