పట్టణాలలో టీఆర్‌ఎస్ దాదాపు క్లీన్ స్వీప్  

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతంలో ఏ పార్టీకి రానంతగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పట్నాల్లో పూర్తి పట్టుసాధించింది. తొమ్మిదింటికి 9 కార్పొరేషన్లనూ క్లీన్‌స్వీప్‌ చేసిన అధికారపార్టీ.. చైర్‌పర్సన్‌ ఎన్నికలు జరిగిన 118 మున్సిపాలిటీల్లో 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. 

కాంగ్రెస్ నాలుగు (వడ్డేపల్లి, మణికొండ, చండూరు, తుర్కయాంజాల్) మున్సిపల్ చైర్‌పర్సన్ల స్థానాలను దక్కించుకుంది. బీజేపీకి రెండు (ఆమన్‌గల్, మక్తల్) మున్సిపల్ చైర్‌పర్సన్ల స్థానాలు దక్కాయి. ఎంఐఎం రెండు మున్సిపల్ (బైంసా, జల్‌పల్లి) చైర్‌పర్సన్ల స్థానాలను కైవసం చేసుకుంది.  

రెండు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదాపడింది. సోమవారం వెలువడిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఫలితాల్లోనూ టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. 

ఐదు ఉమ్మడి జిల్లాలను టీఆర్‌ఎస్‌ పూర్తిగా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఖమ్మంలో ఐదు, నిజామాబాద్‌లో ఏడు, కరీంనగర్‌లో 16, వరంగల్‌లో పది, మెదక్‌లో 13 స్థానాలను పూర్తిస్థాయిలో ఖాతాలో వేసుకున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 20 మున్సిపాలిటీల్లో 17 టీఆర్‌ఎస్‌గెలుచుకోగా.. మక్తల్‌, ఆమన్‌గల్లు బీజేపీ, వడ్డేపల్లిని కాంగ్రెస్‌ దక్కించుకుంది. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 29 ఉండగా.. 25 టీఆర్‌ఎస్‌ గెలుచుకున్నది. మణికొండ, తుర్కయంజాల్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లగా.. జల్‌పల్లిని ఎంఐఎం దక్కించుకున్నది. మేడ్చల్‌ మున్సిపాలిటీ ఎన్నిక వాయిదాపడింది. ఉమ్మడి నల్లగొండలో 18 మున్సిపాలిటీలకు 16చోట్ల టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. చండూరులో కాంగ్రెస్‌ గెలువగా.. నేరేడుచర్ల పెండింగ్‌లో ఉన్నది. ఆదిలాబాద్‌లో భైంసా ఎంఐఎం ఖాతాలోకి వెళ్లింది.