తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య  

తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య జరిగింది. తిరుచ్చి పాలకరై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల విజయరఘు  బీజేపీ జోనల్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానిక గాంధీ మార్కెట్లో బైక్ పార్కింగ్‌కు టోకెన్లు కూడా ఇస్తూ ఉంటారు.

సోమవారం తెల్లవారుజామున టీ తాగేందుకు మార్కెట్‌కు వెళ్లిన రఘుపై ఐదుగురు సభ్యుల ముఠా వేటకొడవళ్లు, కత్తులతో దాడిచేసింది. దీంతో వెంటనే అలర్టైన ఆయన వారి నుంచి తప్పించుకుని పరుగులు తీశారు. అయినప్పటికీ వదలని హంతకులు వెంటాడి మరీ దాడిచేశారు. విచక్షణ రహితంగా నరికారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. 

తీవ్రంగా గాయపడిన రఘును పోలీసులు వెంటనే తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత కాసేపటికే ఆయన చనిపోయారు. విజయరఘు హత్య విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని అక్కడే రాస్తారోకో చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

రఘు హత్య వెనక లాటరీ వ్యాపారి మహ్మద్ బాబు అలియాస్ మిఠాయి బాబు ఉన్నట్టు ఆరోపించారు. వారిద్దరి మధ్య పాతకక్షలు ఉన్నాయని, గతేడాది ఓ సెల్‌ఫోన్ చోరీ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు.