మండ‌లి ర‌ద్దు తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందింది. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం దీనిపై ఓటింగ్ పెట్టారు. 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారని స్పీకర్ వెల్లడించారు. తీర్మానం ఆమోదం పొందిందని సభాపతి తెలిపారు. 

రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ తెలిపారు. తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. తొలుత, శాసన మండలి రద్దుకు ఉదయం ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. ఇప్పుడు  అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి జగన్ సర్కార్ పంపనుంది. పార్లమెంట్‌లోనూ బిల్లు ఆమోదం పొందాలి. కేంద్రం ఒప్పుకుంటే మండలి రద్దయ్యే అవకాశం ఉంది.

శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్టు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో తెలిపారు. గతంలో ఎన్టీఆర్‌ శాసనమండలిని రద్దు చేసినప్పుడు ఈనాడులో ఆ నిర్ణయాన్ని కీర్తిస్తూ  ఎడిటోరియల్స్‌ రాశారని తెలిపారు. ఆనాడు కేవలం ఈనాడు అధిపతి రామోజీరావు కోసమే మండలిని రద్దుచేశారని గుర్తుచేశారు. కానీ నేడు కోట్లాది మంది ప్రజాప్రయోజనాల కోసం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 

మండళ్లు కచ్చితంగా అవసరం అనుకుంటే ప్రతి రాష్ట్రంలో మండలి ఏర్పాటు అయి ఉండేదని, కానీ ఇప్పుడు 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే మండళ్లు ఉన్నాయని చెప్పారు. తమకు మండళ్లు వద్దని అసోం, మధ్యప్రదేశ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు కోరుకున్నాయని చెబుతూ  ఆర్టికల్‌ 169 ప్రకారం మండలి రద్దు అధికారం కూడా శాసనసభకే ఉందని స్పష్టం చేశారు.

రాజకీయ అజెండాతో మండలిలో ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకున్నారని పేర్కొంటూ మండలిలో కేవలం బిల్లును ఎలా అడ్డుకోవాలనేదే ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఇలా ఉండగా, శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ లో 18 మంది ఎమ్మెల్యేలు పాలగొనలేదు. ఓటింగ్ కంటే ముందే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఓటింగ్ సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ లాబీల్లోనే ఉండిపోయారు.

ఓటింగ్ సమయంలో ఎమ్మెల్యే మద్దాలగిరి అసెంబ్లీలో లేరు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు ఎమ్మెల్సీలు కావడంతో వారికి ఓటు హక్కులేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.