హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ అనుమానిత కేసులు

కరోనా వైరస్‌ భయపెడుతోంది. ఇప్పుడు జబ్బు, జలుబు చేస్తే చాలు కరోనా వైరస్‌ అని భయం పట్టుకుంటుంది. నిన్న, మొన్నటి వరకు భయపెట్టిన స్వైన్‌ఫ్లూ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టగానే కరోనా వైరస్‌ భయం నగరానికి వణికిస్తోంది.

హైదరాబాద్‌ నుంచి చైనాకు వెళ్లి, వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఫీవర్‌ ఆస్పత్రికి మూడు అనుమానిత కేసులు వచ్చాయి. జూబ్లీహీల్స్‌కు చెందిన 25 సంవత్సరాల యువకుడు ఇటీవల చైనా నుంచి నగరానికి వచ్చాడు. ఆ తరువాత అస్వస్థతకు గురైన అతను చైనాలో కరోనా వైరస్‌ ప్రబలినట్లు తెలుసుకుని శనివా రం రాత్రి 11-30గంటల సమయంలో నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చాడు. 

అతన్ని పరీక్షించిన వైద్యులు అనుమానిత కరోనా కేసుగా ఐసోలేటెడ్‌ వార్డులో ఇన్‌పేషంట్‌గా చేర్చుకొని చికిత్సలు అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మరో రెండు అనుమానిత కరోనా కేసులు వచ్చాయి. ముగ్గురిని ఐసోలేటెడ్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. 

వారి నుంచి నమునాలు సేకరించి పుణే ల్యాబ్‌కు పంపించనున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా వైరస్‌ పై ఎవరూ ఆందోళన చెందవద్దని సూపరింటెండెంట్‌ పేర్కొన్నా రు. చైనా నుంచి వచ్చిన వారు అస్వస్థతకు గురి కావడంతో భయంతో నిర్ధారణ పరీక్షల కోసం ఫీవర్‌ ఆస్పత్రికి వస్తున్నారని ఆయన తెలిపారు.